IPL 2021: ‘సూపర్’ ఓవర్‌లో ఢిల్లీ విక్టరీ

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో అద్భుత విజయం సాధించింది. గత రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా మారి చివరికి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో హైదరాబాద్ ఏడు పరుగులు మాత్రమే చేయగా, ఢిల్లీ 8 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పృథ్వీషా 39 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 53 పరుగులు చేయగా, ధవన్ 28, కెప్టెన్ పంత్ 37, స్మిత్ 34 పరుగులు చేశారు.

అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ టై అయింది.  బెయిర్ స్టో 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 పరుగులు చేయగా, విలియమ్సన్ 51 బంతుల్లో 8 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. అయితే, చివరల్లో జగదీష సుచిత్ క్రీజులో నిలదొక్కుకోవడం, విలియమ్సన్ క్రీజులో ఉండడంతో మ్యాచ్ క్షణక్షణం ఉత్కంఠ భరితంగా మారింది. చివరి ఓవర్‌లో జట్టు విజయానికి 16 పరుగులు అవసరం కాగా, రబడ వేసిన తొలి బంతి వైడ్ అయింది. ఆ తర్వాతి బంతిని విలియమ్సన్ 4 కొట్టాడు. ఆ తర్వాత మరో పరుగు తీయడంతో స్ట్రైకింగ్ సుచిత్‌కు వచ్చింది. మూడో బంతిని సుచిత్ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి మూడు బంతుల్లో విజయానికి నాలుగు పరుగులు అవసరం కాగా, మూడు పరుగులు మాత్రమే రావడంతో స్కోర్లు సమమయ్యాయి.

దీంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అవసరమైంది. సూపర్ ఓవర్‌లో హైదరాబాద్ ఏడు పరుగులు మాత్రమే చేసింది. 8 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి దిగిన ఢిల్లీ కష్టంగా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఢిల్లీకి ఇది వరుసగా మూడో విజయం కాగా, హైదరాబాద్‌కు ఇది  నాలుగో ఓటమి. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన పృథ్వీషాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నేడు పంజాబ్‌కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.