IPL 2021: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం

ముంబై: వరుస ఓటములతో డీలాపడ్డ రాజస్థాన్‌ రాయల్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన పోరులో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతాకు ఇది వరుసగా నాలుగో ఓటమి. తొలుత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కతాను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన రాయల్స్‌.. ఛేదనలో కెప్టెన్‌ సంజూ శాంసన్‌(42 నాటౌట్‌: 41 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.

134 పరుగుల ఛేదనలో శాంసన్‌ చివరి వరకు క్రీజులో ఉండి కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో రాజస్థాన్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. జోస్‌ బట్లర్‌(5) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరినా యశస్వి జైశ్వాల్‌(22), శివమ్‌ దూబే(22), డేవిడ్‌ మిల్లర్‌(24 నాటౌట్‌: 23 బంతుల్లో 3ఫోర్లు) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా, శివమ్‌ మావీ, ప్రసిధ్‌ కృష్ణ చెరో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. రాహుల్‌ త్రిపాఠి(36: 26 బంతుల్లో 1ఫోర్‌, 2సిక్సర్లు) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ వేగంగా ఆడలేకపోయారు. నితీశ్‌ రాణా(22), శుభ్‌మన్‌ గిల్‌(11), సునీల్‌ నరైన్‌(6), ఇయాన్‌ మోర్గాన్‌(0), దినేశ్‌ కార్తీక్‌(25), రస్సెల్‌(9) చేతులెత్తేశారు. రాయల్స్‌ బౌలర్లలో క్రిస్‌ మోరీస్‌ నాలుగు వికెట్లు తీయగా జయదేవ్‌ ఉనద్కత్‌, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.డెత్‌ ఓవర్లలో మోరిస్‌ కళ్లుచెదిరే బంతులతో కోల్‌కతాకు చుక్కలు చూపిస్తూ వికెట్లు పడగొట్టడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.