అదనంగా ఆక్సిజన్‌ ఉంటే.. ఢిల్లీకి పంపండి: రాష్ట్రాల సిఎంలకు కేజ్రీవాల్‌ లేఖ

ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులన్నీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ ఆక్సిజన్‌ కొరత పెద్ద విపత్తుగా మారింది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సాయం కోరారు. అదనంగా ఆక్సిజన్‌ ఉంటే ఢిల్లీకి పంపాలని తన సహచర ముఖ్యమంత్రులకు లేఖ ద్వారా అభ్యర్థించారు. ‘మీ వద్ద స్పేర్‌ (అదనంగా) ఉంటే… ఢిల్లీకి అందించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశాను. కేంద్ర ప్రభుత్వం కూడా మాకెంతో సాయం చేసింది. అయినప్పటికీ కరోనా తీవ్రత కారణంగా అందుబాటులో ఉన్న అన్ని వనరులు సరిపోవడం లేదు’ అని ట్వీట్‌ చేశారు. ఢిల్లీ ప్రస్తుతం అత్యంత కరోనా ప్రభావిత నగరంగా మారింది. ఇక్కడ రోజులో 20 వేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి.