PBKS vs MI: ముంబైపై పంజాబ్ సూపర్ విక్టరీ..!

ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విక్టరీ సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టును పంజాబ్ బౌలర్లు దారుణంగా దెబ్బతీశారు. కెప్టెన్ రోహిత్ శర్మ(63), సూర్యకుమార్ యాదవ్ (33), కీరన్ పొలార్డ్(16) రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా చేతులెత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు ముంబై జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 131 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో షమి 2, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీసుకోగా దీపక్ హుడా, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

అనంతరం 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్ని అందించారు. మయాంక్ అగర్వాల్ 25 పరుగులు చేసి ఔటైనా, కెప్టెన్ కేఎల్ రాహుల్ (60)కు, క్రిస్ గేల్ (43) తోడవ్వడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో పంజాబ్ జట్టు కేవలం 17.4 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ ఆ ఒక్క వికెట్ తీసుకున్నాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.