ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేయమంటే అరెస్టులా?

• సి.పి.ఎస్. రద్దు చేసే ఉద్దేశం ఉందో లేదో సి.బి.ఐ. దత్తపుత్రుడు చెప్పాలి
పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఉద్యోగుల ఓట్ల కోసం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సి.పి.ఎస్.) రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? సి.పి.ఎస్. రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకువస్తామని మేనిఫెస్టోలో చెప్పిన మాట నిజమా కాదా? అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత.. బైబిల్ అని చెప్పే సి.బి.ఐ. దత్తపుత్రుడు శ్రీ జగన్ రెడ్డి సి.పి.ఎస్. రద్దు చేస్తారా చేయరా… ఆ ఉద్దేశం ఉందో లేదో ప్రకటించాలి. ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఛలో సీఎమ్ఓ అని పిలుపు ఇస్తే ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. హామీని తుంగలోకి తొక్కి ఉద్యోగులను మోసగించాలనే దురుద్దేశం ఉండటం వల్లే ఉపాధ్యాయులను, ఉద్యోగులను అణచివేయాలని చూస్తోంది. ఆంక్షల పేరుతో విజయవాడ నగరాన్ని నిర్బంధించిన తీరు… హైవే వెంబడి ముళ్ల కంచెలు వేసిన విధానం చూస్తుంటే ఎమర్జెన్సీ పరిస్థితులను తలపించాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం ఓ భాగం. వాటిని నిలువరించాలనే ఉద్దేశంతో ప్రజలను ఇక్కట్లకు గురి చేశారు. ఉపాధ్యాయులను గృహనిర్బంధాలు చేసి, అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం. వాళ్ళు అడిగింది ఒక్కటే… మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. ఇచ్చిన మాట గుర్తు చేస్తే అరెస్టులు చేస్తారా? ఉపాధ్యాయుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. విద్యా సంవత్సరంలో మార్పులు చేయడం, సెలవులు రద్దు చేయడం, సెలవుపెడితే చర్యలు ఉంటాయని హెచ్చరించడం చూస్తుంటే వైసీపీకి ఉపాధ్యాయులపై ఎంత కక్ష ఉందో అర్థం అవుతోందని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు.