‘వారాహి’ వైసీపీ పాలనను అంతం చేస్తుందని భయం

* రంగుల పిచ్చి నాయకులు జనసేనను అనడం చూస్తే నవ్వొస్తోంది
* అన్ని నిబంధనలు పాటించే వాహనం సిద్ధం
* సహజ సంపదను దోపిడీ చేస్తున్న పాలకులు
* ఉత్తరాంధ్ర యువత కోసం వైసీపీ పాలకులకు ఆలోచన లేదు
* ‘యువ శక్తి’ కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతుంది
* శ్రీకాకుళం మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

దుష్ట వైసీపీ పాలనను నామ రూపాలు లేకుండా తొక్కేసేలా కనిపిస్తున్న ‘వారాహి’ వాహనం చూస్తే ఈ వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు నిర్వహించే ముందు శ్రీ మనోహర్ గారు శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులకు ఏ పనీ లేకుండా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడే విషయాల మీద దృష్టి పెట్టకుండా, శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహనం రంగుల గురించి వారు మాట్లాడుతుంటే ఏం అనాలో కూడా అర్థం కావడం లేదు. ప్రజా పాలన చేయమని మేము చెబుతుంటే మా పార్టీ ఎన్నికల వాహనం రంగుల గురించి వీళ్లు మాట్లాడడం చూస్తుంటే ఈ ప్రభుత్వంలో ఎవరికీ పనిలేదని అర్థం అవుతోంది. ప్రజా ధనం వృథా చేసి ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన వారు… వాహనం రంగు చూసి భయపడటం అంటే వాళ్ళకి మామూలు భయం పట్టుకోలేదు అని అర్ధం అవుతుంది. నిబంధనల ప్రకారమే ఆ వాహనం ఉంటుంది. చట్టాల గురించి, వ్యవస్థల గురించి పూర్తి అవగాహన ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ వాటిని అతిక్రమించే పనులు చేయరు. చట్టాన్ని జనసేన పార్టీ పూర్తిస్థాయిలో గౌరవిస్తుంది. రాష్ట్రంలో గుట్టలుగా ప్రజా సమస్యలు ఉన్నాయి. పరిష్కరించి అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వ పాలకులు ఏం చేయాలో తెలియక ఇష్టానుసారం మాట్లాడటం దారుణం.
* ఈ ప్రాంత యువత ఆలోచనే పార్టీ విధానం అయ్యింది
శ్రీకాకుళం జిల్లా యువత ఆలోచన జనసేన పార్టీ విధానం అయింది. 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి అన్న ఇక్కడి యువకుడి మాట నాకు ఇంకా గుర్తే. దాని కోసమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఓ ప్రణాళికతో జనసేన పార్టీని పటిష్టం చేసి పూర్తి స్థాయిలో సామాన్యుడికి సైతం రాజకీయాలు అందే విధంగా ముందుకు వెళ్తున్నారు. సహజ వనరులను దోపిడీ చేసిన వైసీపీ పాలకులు ఉత్తరాంధ్ర యువతకు ఏమి మిగల్చలేకపోయారు. ప్రతి ఏటా శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు 15 వేల మంది గుజరాత్ తోపాటు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. ఉన్నత చదువులు చదివినా, సరైన ఉద్యోగాలు రావడం లేదు. ముఖ్యంగా మత్స్యకార యువతకు ఉద్యోగాలు దూరం అవుతున్నాయి. అలాంటి వారి కోసం జనసేన పార్టీ ప్రత్యేక శిక్షణ కేంద్రం మొదలు పెట్టింది. ఇది ఉత్తరాంధ్ర యువతకు ఎంతగానో ఉపయోగపడేలా చూస్తాం. ఈ ప్రాంతానికి అవకాశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్న యువతకు ఒక దారి చూపే బాధ్యత జనసేన తీసుకుంటుంది. వచ్చే మూడు రోజులు జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల వారితో మాట్లాడి, జిల్లాలోని సమస్యలు గురించి వివరంగా తెలుసుకుంటాం. కచ్చితంగా బలమైన నాయకత్వం తయారు చేస్తాం. ప్రజా పోరాటాల్లో యువత సింహభాగం వహించేలా వారిని సంసిద్ధులను చేస్తాం.
* రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా యువ శక్తి
వివేకానందుడు జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ నిర్వహించబోయే యువ శక్తి కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయం గొప్పది. అలాగే పోరాట నేల. గొప్ప పోరాట గుడి. ఇక్కడి పోరాటాల గురించి, సమస్యల గురించి ప్రపంచానికి తెలియజెప్పేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుంది. అన్ని విషయాల మీద అక్కడ చర్చిస్తాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి భవిష్యత్తు ఆలోచన, యువత కోసం ఏం చేయాలి అనేది తెలియజేస్తారు. దీనిలో ఉత్తరాంధ్ర ప్రాంత యువత అంతా పాల్గొని, ఇక్కడి యువశక్తి గురించి ప్రపంచానికి తెలియజేయాలి” అన్నారు. సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీమతి పాలవలస యశస్విని, పెదపూడి విజయ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా నాయకులు గేదెల చైతన్య, విశ్వక్షేన్, పేడాడ రామ్మోహన్, కోరాడ సర్వేశ్వరరావు, కణితి కిరణ్ పాల్గొన్నారు.