నిత్య‌వ‌స‌ర ధ‌ర‌ల‌ను అదుపుచేయ‌లేని జ‌గ‌న్ ప్ర‌భుత్వం

  • జ‌గ‌న్ పాల‌న‌లో ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్లు లేదు
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌: పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఊదరగొడుతున్న జగన్‌ పాలనలో నిత్యావ‌స‌ర ధ‌ర‌లు రెండింట‌ల‌య్యాయ‌ని, దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల వంటిళ్లలో మంటలురేగుతున్నాయని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ వైపీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరాల ధరలు సగటున 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయ‌ని, సామాన్యులు పెరిగిన ధ‌ర‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బియ్యం, కంది పప్పు, పంచదార, నూనెల ధరలు ఆకాశాన్నంటాయ‌ని, అయిదేళ్ల కిందటితో పోలిస్తే ఉప్పులు, పప్పులు ఇతర సరకుల రూపంలో నెలకు రూ.2వేలకుపైగా అదనపు భారం పెరిగింద‌న్నారు. సన్న బియ్యం ధర క్రమంగా పెరిగి గతంలో రూ.40 ఉండగా ఇప్పుడు అది రూ.55పైగానే ఉందన్నారు. ఇదే సమయంలో తక్కువ ధరలకు రేషన్‌ డిపోల్లో పంపిణీ చేసిన సందర్భం లేద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అంటూ ఊద‌ర గొడుతూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేసుకుంటున్న జ‌గ‌న్ పెరిగిన ధ‌ర‌ల‌పై ఏం సామాధానం చెబుతారంటూ నిల‌దీశారు. జ‌గ‌న్ పాల‌న‌లో ఏం కొనేటట్టులేదు. ఏం తినేటట్లు లేదంటూ ఎద్దేవా చేశారు. ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై చ‌ర్య‌లేవి? ధరల నియంత్రణపై పాలకులకు కనీస శ్రద్ధ లేదని. గ‌త టీడీపీ పాలనలో ప్రతి నెలా జిల్లాస్థాయిలో ధరల నియంత్రణ కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన జరిగేవని గుర్తు చేశారు. ఇలా నెల రోజుల వ్యవధిలో వివిధ రకాల ధరలను సమీక్షించేవారని. ఏవైనా సరకుల ధరలు పెరిగితే ఇతర ప్రాంతాల నుంచి వాటిని రప్పించి తక్కువ ధరకు రైతు బజార్లలో విక్రయించేవారని తెలిపారు. గ‌తంలో ధ‌రలు పెరిగితే స్థానికంగా టోకు, చిల్లర వర్తకులతో చర్చించి నియంత్రణకు చర్యలు చేపట్టేవారని, ఇప్పుడు జేసీ అధ్యక్షతన కమిటీలున్నా సమావేశమవడమే అరుదుగా మారింద‌న్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరిగినా పట్టించుకొనే వారే క‌రువ‌య్యార‌ని మండిపడ్డారు. ధరలు పెరిగినంత వేగంగా ప్ర‌జ‌ల‌ ఆదాయాలు పెరగలేదని, ఏటా సరకులు ధరలు అమాంతం పెరగడం వల్ల వంటింటి ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.