బీసీలను మోసం చేసిన జగన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదు

ఏలూరు: బీసీలను నమ్మించి మోసం చేసిన జగన్మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కులేదని రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు పితాని సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఏలూరులో గౌడ సమాఖ్య ఆధ్వర్యంలో గౌడ, శెట్టిబలిజ, శ్రీ శయన, ఈడిగ ఆత్మీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి, టిడిపి నాయకులు పితాని సత్యనారాయణకు ఆత్మీయ స్వాగతం లభించింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి, ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆయనకు ఘన స్వాగతం పలికారు.. సదస్సు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై పితాని విరుచుకుపడ్డారు.. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌ ఆ కార్పొరేషన్ల చైర్మన్‌లకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయలేదంటూ ఎద్దేవా చేశారు.. ఇక బీసీ కార్పొరేషన్లకు నిధులు కూడా కేటాయించకపోవడం దారుణమైన చర్య అని అన్నారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకొని సీఎం జగన్‌ బలహీన వర్గాల నాయకుల్ని రాజకీయంగా, సామాజికంగా అణచివేయాలనుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. పేదవానికి, ధనికులకు మధ్య ఉన్న వ్యత్యాసం కొనసాగే విధంగా అమలు చేస్తున్న పథకాలన్నీ రాజ్యాంగ స్వేచ్ఛకు గొడ్డలిపెట్టువంటివేనని, ఇప్పటికైనా అటువంటి విధానాలకు వైసిపి స్వస్థిపలకాలని హితవు పలికారు.. వైసిపి అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు తిరిగి మళ్ళీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ ఎన్ని డ్రామాలాడిన నమ్మే పరిస్థితి లేదన్న విషయాన్ని గ్రహించాలని, రానున్న రోజుల్లో కూటమి అభ్యర్ధుల విజయం తథ్యమని స్పష్టం చేశారు.. తొలుత నిర్వహించిన సదస్సులో ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి మాట్లాడుతూ వైసిపి పాలనలో దౌర్జన్యం, దోపిడి, లూటీలు పెరిగిపోయాయని, ఈ తరుణంలో ధర్మం వైపు ఉండాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు మరోసారి సిద్దమైన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఇంటికి సాగనంపాలని సూచించారు. జనసేన ఏలూరు ఇన్‌ఛార్జ్‌ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలతో పాటూ ప్రతిపక్షాల గొంతునొక్కే విధంగా వైసిపి రాక్షస పరిపాలన ఉందని, దీన్ని అంతమొందించేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎమ్మార్డీ బలరాం, జనసేన నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, నూకల సాయి ప్రసాద్, పైడి లక్ష్మణరావు,ఎట్రించి ధర్మేంద్ర, వాసు నాయుడు, బోండా రాము నాయుడు, జనసేన రవి, వేముల బాలు, పలువురు గౌడ సంఘంనేతలు, జనసేన, తెలుగుదేశం, బిజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.