ప్రధాని మోదీకి మరో లేఖ రాసిన జగన్

ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ రాశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని లేఖలో ఆరోపించారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కేఆర్ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ప్రాజెక్టుల వద్ద రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు సీఐఎస్ఎఫ్ బలగాల పరిధిలోకి ప్రాజెక్టును తీసుకురావాలని జగన్ విన్నవించారు. విభజన చట్టాన్ని, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలను, కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని చెప్పారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరగకుండా తెలంగాణ ఎప్పటికప్పుడు నీటిని వాడేస్తోందని అన్నారు. దీనివల్ల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సాగునీరు రాకుండా పోతోందని చెప్పారు.

కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండానే నాగార్జున సాగర్, పులిచింతల, శ్రీశైలం ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా తక్షణమే కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.