జగనన్న కాలనీలు అతిపెద్ద స్కాం: ఎస్ వి బాబు

పెడన నియోజకవర్గం, జగనన్న కాలనీలు పచ్చి మోసమని, పెద్ద స్కామ్ అని జనసేన ఏనాడో చెప్పింది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న ఇల్లు పేదలకు అందరికీ కన్నీళ్లు అనే హ్యాష్ ట్యాగ్ తో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలో జరుగుతున్న అక్రమాలను, నత్త నడకతో సాగుతున్న నిర్మాణాలను సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు వైసిపి దళిత ఎమ్మెల్యే, జగన్ రెడ్డి వీరాభిమాని ఉండవల్లి శ్రీదేవి జగనన్న కాలనీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే తనను పార్టీ నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దళిత సమాజం గమనించాలి జగన్ రెడ్డికి దళితులపై ఏపాటి గౌరవం ఉందో? సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే పేదవాడి ఆశలను ఆసరాగా చేసుకుని జగనన్న కాలనీలు అనే అతి పెద్ద కుంభకోణాన్ని వైసిపి ప్రభుత్వం రూపొందించింది. ఆంధ్రరాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా ఒక్క కాలనీ అంటే ఒక కాలనీలో కూడా పూర్తిస్థాయి నిర్మాణాలు జరగలేదు. మౌళిక వసతులు కల్పించలేదు. ఎక్కడ చూసినా ఏ కాలనీని పరిశీలించిన పునాదుల వరకు లేదా సగం కట్టి ఆపేసిన నిర్మాణాలే దర్శనమిస్తాయి. లోప భూయిష్టమైన స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనువుకాని ప్రాంతాలను కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాలను, చెరువులను ఎంపిక చేసి స్థానికంగా ఉండే వైసీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి తూతూ మంత్రంగా నాసిరకం పనులు చేయించి చేతులు దులుపుకోవడం వల్ల ఈరోజు అనేక మంది పేదలు అప్పులు పాలయ్యారు. ఎక్కడ వరకో ఎందుకు పెడన నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మరియు గృహ నిర్మాణ శాఖామంత్రి అయిన జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని జగనన్న కాలనీల పరిస్థితి ఘోరంగా ఉంది. ఏ ఒక్క కాలనీకి పూర్తిస్థాయి మౌళిక వసతులు కల్పించలేదు. కొన్ని చోట్ల అయితే అసలు గృహ నిర్మాణాలే ప్రారంభించలేదు. పెడన నియోజకవర్గంలోని పలోటి 1, పలోటి 2, పైడమ్మ కాలనీలో జరిగిన అవినీతి రాష్ట్రంలో మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం కడుచోచనీయం. పేదవాడి కలలతో, ఆశలతో ఆటలాడుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. రాబోయే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.