ఆముదాలవలస జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

ఆముదాలవలస: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అందవలసిన నియోజకవర్గంలోని ఆముదాలవలస మండలం, గాజుల కొల్లివలసలో ప్రభుత్వం అందజేసిన జగనన్న ఇళ్ల స్థలాలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం లక్షలాది ఇళ్లను మంజూరు చేశామని, ఇప్పటివరకు దాదాపు 50 శాతం ఇళ్లను పూర్తిచేశామని చెబుతూ పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చాలాచోట్ల ఇప్పటివరకు పనులు కూడా పూర్తిగా ప్రారంభం కాలేదని కానీ ప్రభుత్వం పూర్తి చేసినట్లు చెబుతున్నారని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్నట్టు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో ఈ యొక్క ఇళ్ల స్థలాలను పర్యటించి వీరందరికీ న్యాయం జరిగేలా జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు.