వితండం… బూతుల పంచాంగమే వైసీపీకి తెలుసు

* సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందడం లేదు
* ఈ ముఖ్యమంత్రి తీరు పట్ల ప్రజల్లో ఏవగింపు మొదలైంది
* ఉపాధి లేక, వలసలతో యువత అల్లాడుతున్నారు
* వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది
* ఉత్తరాంధ్ర సహజ వనరులను దోచేస్తున్నారు
* విజయనగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

‘వితండ వాదన.. అవగాహన లేమి తప్ప ఈ ముఖ్యమంత్రికి ఏమి తెలీదు. బటన్లు నొక్కడమే తనకు తెలిసిన విద్యగా, సంక్షేమం పేరుతో మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న పాలన పట్ల ప్రజల్లో ఏవగింపు మొదలైంద’ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నియోజకవర్గాల సమీక్షల కోసం వచ్చిన ఆయన శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రకటనల పేరుతో, సంక్షేమం చేస్తున్నామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. అందుతున్న సంక్షేమం కూడా నికరంగా అందడం లేదు. సంక్షేమ పథకాలకు ఒక దిశా దశ లేదు. పింఛన్లు మంజూరు, రేషన్ కార్డులు ఇవ్వడం వంటివి క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదు. బటన్లు నొక్కుతూ అద్భుతం చేస్తున్నాను అంటున్న ఈ ముఖ్యమంత్రి ఆగిపోయిన పింఛన్లు, రేషన్ కార్డుల విషయంలో ఏం సమాధానం చెబుతారు..? జగనన్న ఇళ్లలో అంతులేని అవినీతి జరిగింది. దీనిపై జనసేన పార్టీ చేపట్టిన సోషల్ ఆడిట్ లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. కచ్చితంగా దానిని ప్రజల ముందుపెడతాం.
* బెదిరింపులే లక్ష్యం
ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన గుంకలాంలోని జగనన్న కాలనీలో లబ్ధిదారులను ఇల్లు కట్టుకోవాలని సతాయిస్తున్నారు. ఇల్లు నిర్మించుకోకపోతే పట్టాలు లాక్కుంటామని బెదిరిస్తున్నారు. కనీసం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇల్లు కట్టుకోవాలి అంటే పేదలు ఎలా కట్టుకుంటారు..? రోజువారీ కూలీలు ఇప్పుడు అర్జెంటుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే వారి పరిస్థితి ఏమిటి..? ఈ ప్రభుత్వం ప్రజలను బెదిరింపులకు గురిచేసి పాలన సాగించాలని భావిస్తోంది. క్షేత్రస్థాయిలో జనసైనికులు జగనన్న ఇళ్లలో జరుగుతున్న అవినీతిపై పోరాడుతున్నారు. ఆ ఇళ్లలో అవినీతిని ప్రజలకు తెలియచెప్తాం.
* ఒకే కుటుంబం వనరులు దోచుకుంటోంది
విజయనగరం జిల్లాలో ఒకే కుటుంబం ఇక్కడ ఉన్న అపార సహజ వనరులను దోచుకుంటోంది. ఇష్టానుసారం మైనింగ్ చేస్తూ, అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతూ విజయనగరం జిల్లాను కొల్లగొడుతున్నారు. జాతికి చెందాల్సిన సహజ వనరులను జేబులో వేసుకుంటున్నారు. మత్స్యకార గ్రామాల్లో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. వలసలు నిరోధించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. జెట్టీలు, చిన్న ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తే మత్స్యకారులకు ఎంతో ఉపయోగం. అలాంటిది ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న మత్స్యకార భరోసా సైతం అర్హులకు అందడం లేదు. మత్స్యకారుల సమస్యలను పూర్తిగా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది.
* ప్రాజెక్టులను పట్టించుకోలేదు
ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా కీలకం. వాటికి చాలా చిన్న మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టినా అవి పూర్తి అయ్యేవి. వాటి మీద ఈ ప్రభుత్వం కనీస దృష్టి పెట్టలేదు. అడిగితే కేసులు పెడుతున్నారు.. బెదిరిస్తున్నారు. విజయనగరం జిల్లాలో భయంకరమైన వాతావరణం ఉంది. చిన్నచిన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు సైతం ఎవరో కొందరు ఫోన్ చేస్తే ఇచ్చే విధంగా తయారయ్యాయి. ఇక్కడ యువతలో నిస్పృహ, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాడిపూడి రిజర్వాయర్ పర్యాటకం మీద సుమారు 300 మంది బతికే అవకాశం ఉంది. దానిని పూర్తిగా నిలుపుదల చేశారు. ఎక్కడో కృష్ణా నదిలో పడవ ప్రమాదం జరిగితే ఇక్కడ పర్యాటకం నిలిపివేయడం దారుణం. వ్యవస్థలో ఎక్కడైనా పొరపాటు జరిగితే దానిని సరిదిద్దే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేయరు. ఆ పొరపాటును మరింత పెద్దది చేసి ఎదుటివారిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం మాత్రమే ఈ ముఖ్యమంత్రికి తెలుసు. కొండలు, గుట్టల్ని ఇప్పటికే మింగేశారు. చెరువులను సైతం ఆక్రమిస్తున్నారు. వాళ్ల వ్యాపారాలకు, వాళ్ల మాల్స్ పార్కింగ్ కోసం విజయనగరంలో చెరువును ఆక్రమించిన ఘటన నా దృష్టికి తీసుకువచ్చారు. ఇదే పరిస్థితి కొనసాగితే విజయనగరం జిల్లా పూర్తి ఊబిలో కూరుకుపోతుంది.
* ప్రతి సమస్య బయటకు తీసేలా వాట్సాప్ గ్రూప్
జనసేన పార్టీ ప్రతి ప్రజా సమస్యను బయటపెట్టాలని భావిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం కోసం పటిష్టమైన ప్రణాళిక రూపొందిస్తాం. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ను ప్రారంభించి నియోజకవర్గంలోని కీలకమైన సమస్యలు గుర్తించేలా కార్యాచరణ తయారు చేస్తాం. బిడ్డల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసే జనసేన నాయకత్వాన్ని తయారు చేయడమే ముందున్న లక్ష్యం. జనసైనికులు ప్రజా పోరాటాల్లో ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ న్యాయ విభాగం అండగా నిలబడుతుంది. ఎన్నికల పొత్తులు, ఎన్నికల వ్యూహాల గురించి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు పోరాడాల్సిన అవసరం కనిపిస్తోంది. జనసేన పార్టీకి పదవులు కన్నా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం” అన్నారు. సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని, జనసేన నాయకులు

వంపూరు గంగులయ్య, శ్రీమతి ఎ.దుర్గా ప్రశాంతి, బోడపాటి శివదత్, గిరడా అప్పలస్వామి, శ్రీమతి లోకం మాధవి,

ఆదాడ మోహన్ రావు,శ్రీ వబ్బిన సత్యనారాయణ పాల్గొన్నారు.
* అంబేద్కర్ చూపిన బాటలో జనసేన ప్రయాణం
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి మనోహర్ గారు శనివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహనీయుడు అంబేద్కర్ చూపిన బాటలో, ఆయన సాధన కోసం జనసేన పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ సందర్భంగా మనోహర్ గారు అన్నారు. జనసేన పార్టీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి మహనీయుడి సేవలను స్మరించారు.