జగన్‌ది నీచమైన పాలన: గురాన అయ్యలు

విజయనగరం, రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి నీచమైన పాలన చేస్తున్నారని జనసేన నేత గురాన అయ్యలు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుపై రోజుకొక తప్పుడు కేసు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షనేతలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక పాలన అంతమొందించే సమయం దగ్గర పడిందన్నారు. రాజకీయ కక్షతో రగిలిపోతున్న సీఎం తీరు ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకు అర్ధమైందని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నేటికీ ఒక్క ఆధారం కూడా చూపించలేదన్నారు. మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వాటికి సమాధానం చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టడానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కంపెనీల అనుమతులపై కేసు నమోదు చేయడం సిగ్గుచేటున్నారు. అలాగే ఏపీలో ఇసుక తవ్వకాలపై సీబీఐ, సీవీసీ విచారణ జరిపించాలని తెలుగు దేశం ఎంపీలు ఫిర్యాదు చేస్తే దానికి ప్రతిగా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఇసుక పాలసీపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. పాడి గేదెల కొనుగోలులో 2887 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని సాక్ష్యాధారాలతో జనసేన పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్
ఆరోపణలు చేశారన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ స్కాంపై శ్వేతపత్రం విడుదల చేయాలని, సీబీఐ విచారణకి ఆదేశించాలని డిమాండ్ చేశారు.