Jai Bhim: ‘చిన్నతల్లి’కి ఆర్థిక సాయం అందించిన సూర్య

జై భీమ్‌ చిత్రంలో తమిళనాడుకు చెందిన న్యాయమూర్తి చంద్రుగా నటించిన తమిళ నటుడు సూర్య మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.    చేయని తప్పుకు జైలుపాలై, మరణించిన రాజన్నకు  న్యాయం జరిగేలా  ఈ సినిమాలో చిన్నతల్లి చేసిన పోరాటం కట్టిపడేస్తుంది.  అయితే నిజజీవితంలో ఆ పోరాటం చేసిన వ్యక్తి పార్వతి అమ్మాళ్‌. ఆమె పరిస్థితిని  చూసి చలించిపోయిన సూర్య ఆర్థిక సాయం అందించారు. ఆమె పేరుమీద రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, ఆ మొత్తంపై ప్రతినెలా వచ్చే వడ్డీ ఆమెకు అందేలా చేశారు. ఇటీవల తమిళనాడులోని గిరిజనుల (ఇలరు తెగ) సంక్షేమానికి రూ. కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే.  జస్టిస్‌ చంద్రు కెరీర్‌లో కీలకంగా నిలిచిన ఒక కేసు ఆధారంగా రూపొందిన ‘జై భీమ్‌’ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. జ్ఞాన్‌వేల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజన్నగా మణికందన్‌ , చిన్నతల్లిగా లిజో మోల్‌ జోసేలు నటించారు. కాగా, పార్వతి అమ్మాళ్‌కు ఇల్లు కట్టిస్తానంటూ నటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ కూడా ఇటీవల ప్రకటించారు.