మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో లఖింపూర్‌ ఖేర్‌ కేసు విచారణ

లఖింపూర్‌ ఖేర్‌ ఘటనను హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపేందుకు యుపి ప్రభుత్వం సోమవారం అంగీకరించింది. రైతులు సహా ఉఎనిమిది మంది మరణించిన లఖింపూర్‌ ఖేర్‌ హింసాకాండ ఘటన విచారణలో యోగి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందంటూ గతవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మాజీ న్యాయమూర్తులైన జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ జైన్‌, జస్టిస్‌ రంజిత్‌ సింగ్‌ల పర్యవేక్షణలో ఈ కేసు విచారణను చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి అంగీకరిస్తున్నామని,   న్యాయమూర్తి పేరును సూచించాల్సిందిగా యుపి ప్రభుత్వం  కోర్టును కోరింది.  పంజాబ్‌-హర్యానా హైకోర్టు మాజీ జడ్జీ రాకేష్‌ కుమార్‌ జైన్‌ను నియమించేందుకు  కోర్టు సముఖంగా ఉందని, వారిని సంప్రదించిన అనంతరం బుధవారం ఈ విషయాన్ని స్పష్టం చేస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.  అలాగే లఖింపూర్‌ కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందంలో (సిట్‌) సీనియర్‌ అధికారుల్ని మరింత మందిని చేర్చాలని  సూచించారు.  కాగా, అక్టోబర్‌ 3న యుపిలోని లఖింపూర్‌ ఖేరి జిల్లాలో శాంతియుతంగా నిరసన చేపడుతున్న రైతులను కేంద్రమంత్రి అజయ్  మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారుతో తొక్కించిన ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్‌ సహా మొత్తం ఎనిమిది మంది మరణించిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.