వైసిపి కాపు నాయకులపై మండిపడిన జనసేన ఎంపిటిసిలు

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష రాజమండ్రిలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కుల సంఘ నేతలులా సమావేశాన్ని నిర్వహించడాన్ని ఖండిస్తూ చిత్రాడ ఎంపిటిసి శ్రీమతి దూలపల్లి రత్నం, కందరాడ ఎంపిటిసి శ్రీమతి పిల్లా సునీతలతో సంయుక్తంగా పిఠాపురం పట్టణంలో స్థానిక సూర్యరాయ గ్రంథాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈ సందర్భంగా తోలేటి శిరీష మాట్లాడుతూ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమ శాఖలలో ఉన్న లోపాల్ని సరిచేయకుండా జనసేన అధినేత ప్రజా నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ ని విమర్శించడం కోసమే ఈ వైసీపీ ప్రభుత్వ ప్రతినిధులు తమ సమయం వెచ్చిస్తున్నారని, కేవలం సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం తమ పదవులు నిలుపుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషిస్తూ ప్రజల దృష్టిలో మరింత హీనంగా దిగజారిపోతున్నారని ఆక్షేపించారు.
విద్యా విధాన లోపంతో, వైద్య సదుపాయాల లేమితో, రవాణా రోడ్ల గుంతలతో, పౌర హక్కులు వైసిపి నాయకుల దౌర్జన్యంతో, నిండిపోయి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలం అయింది అంటూ విమర్శించారు. చిత్రాడ ఎంపిటిసి దూలపల్లి రత్నం మాట్లాడుతూ ఒక దళిత మహిళల అయిన తనను జనసేన పార్టీ ఒక ఊరికి ఎంపిటిసిని చేసిందని పవన్ కళ్యాణ్ కి కులమత తారతమ్యాలు లేవని జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు కుల ప్రస్తావన లేని పయనం సాగిస్తూ మా పవన్ కళ్యాణ్ ని 2024లో ప్రజల సహకారంతో ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పారు. కందరాడ ఎంపిటిసి పిల్లా సునీత మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి అని, మూడు సంవత్సరాల కాలంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగకపోయినా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు కోసమే మాట్లాడుతూ కాలం వెళ్ళబుచ్చుతున్న ఈ ప్రభుత్వానికి రానున్న కాలంలో ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో విరవాడ ఎంపీటీసీ అభ్యర్థి రామిశెట్టి సూరిబాబు, నియోజకవర్గ దళిత నాయకుడు వాకపల్లి సూర్య ప్రకాష్, పిల్లా సూర్యనారాయణ, కొండపల్లి శివయ్య, గంజి గోవిందరాజు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.