జనసేన కోసం ఇప్పటం నిలబడింది… ఇప్పటం కోసం జనసేన నిలబడుతుంది
* ముఖ్యమంత్రి తన బలం మొత్తం ప్రయోగించి గ్రామాన్ని ఇబ్బంది పెట్టడమేంటి?
* సీఎం మెప్పు కోసమే స్థానిక ఎమ్మెల్యే, యంత్రాంగం తాపత్రయం
* అంత కక్ష సాధించడానికి ఇప్పటం గ్రామస్తులు చేసిన తప్పేంటి?
* ఇప్పటంలో జనసేన నాయకుల అక్రమ అరెస్టుల్ని ఖండిస్తున్నాం
* మంచి పాలన చేయమని గెలిపిస్తే ముష్టి పాలన చేస్తున్నారు
* వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ కంకణబద్దులై ఉన్నారు
* రాజమండ్రిలో మీడియాతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
ముఖ్యమంత్రి తన బలం మొత్తం ఉపయోగించి ఒక గ్రామ ప్రజల్ని ఇబ్బందిపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వ్యాఖ్యానించారు. అంత కక్ష సాధించడానికి ఇప్పటం గ్రామస్తులు చేసిన తప్పేమిటో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం స్థానిక శాసన సభ్యుడు, అధికార యంత్రాంగం పోలీసుల సాయంతో జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చిన ఇప్పటం గ్రామం మీద కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన 80 మంది జనసేన నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయకుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కులు అందచేశారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ “ఇప్పటం గ్రామంలో ఉదయం నుంచి నడుస్తున్న డ్రామా ముఖ్యమంత్రి పైశాచికానందం కోసం, ఆయన మెప్పు కోసం అనుచర గణం చేస్తున్న ప్రయత్నాలు అందరికీ అర్ధం అవుతున్నాయి. 4 వేల మంది జనాభా ఉన్న గ్రామంలో 80 అడుగుల రోడ్డు ఉంటే అది చాలదని 120 అడుగులు చేస్తామంటూ వేధిస్తున్నారు. ఇప్పటం గ్రామస్తులు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూమి ఇచ్చారు కాబట్టి వీరంతా జనసేన అభిమానులు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన నిలబడ్డారు. వీరికి జనసేనకు సంబంధం ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కక్షపూరితంగా చేస్తున్న కార్యక్రమం ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటం కూల్చివేతలతో ముఖ్యమంత్రి వైఖరి ఎలాంటితో రాష్ట్ర ప్రజలకు అర్ధం కావాలి. ఇప్పటం ఒక చిన్న గ్రామం. కులమతాలకు అతీతంగా బతికే గ్రామంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటం సంఘటనల నేపథ్యంలో వారికి సంఘీబావం తెలిపేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు వెళ్తుంటే వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.
* ఇప్పటంవాసులూ.. ధైర్యంగా ఉండండి
ఇప్పటం గ్రామానికి, అక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి జనసేన సభ్యుడికి ఉంది. ఇప్పటం గ్రామస్తులు ధైర్యంగా నిలబడండి. ఇప్పటం గ్రామం జనసేన కోసం నిలబడింది. మనం ఆ గ్రామ ప్రజల కోసం నిలబడాలి. నిండు మనసుతో జనసేన ఆవిర్భావ సభ కోసం మీరు భూమి ఇచ్చారు. అద్భుతంగా సభ నిర్వహించాం. మీకు మాటిస్తున్నాం. మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పారద్రోలేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకుని నిలబడ్డారు. మేమంతా మీకు అండగా నిలబడతాం. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా ఎస్పీతో మాట్లాడాము. పోలీసులు ఇక మీదట ఇప్పటం గ్రామంలోకి రారు అని ఆయన హామీ ఇచ్చారు. అధికార యంత్రాంగానికి మద్దతు ఇవ్వమని చెప్పారు. ఎస్పీ గారిని మరోసారి కోరుతున్నాం. ముందుగా అరెస్టు చేసిన జనసేన అభిమానులు, నాయకుల్ని విడిచిపెట్టండి. మా నాయకుల్ని విడుదల చేయకుండా ఇబ్బందిపెడితే రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులంతా కలసి శాంతియుతంగా నిరసన తెలియచేస్తాం.
• వైసీపీ శాసనసభ్యుల అరాచకాలు గుర్తుపెట్టుకుంటాం
ప్రభుత్వ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. దేవాలయంలో ఉన్నవారిని తాళాలు పగులగొట్టి ఈడ్చుకెళ్లారు. మహిళల్ని ఈడ్చుకెళ్లారు. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. దేని కోసం కక్ష సాధింపు. మంచి పరిపాలన అందించమని 151 స్థానాల్లో గెలిపిస్తే సమయం మొత్తం ఇలాంటి ముష్టి కార్యక్రమాల కోసం వృథా చేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. వైసీపీ శాసన సభ్యులు చేస్తున్న అరాచకాలు గుర్తు పెట్టుకోండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజల పక్షాన బలంగా నిలబడుతుంది. ప్రభుత్వ చర్యల్ని ఎండగట్టి తీరుతుంది.
• ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు
రాష్ట్రంలో పెట్టుబడుల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారిని స్వాగతించాలి, గౌరవంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరమైన విమర్శలు చేయమని ప్రకటిస్తే.. ఇప్పుడు కెలికింది ఎవరు? శ్రీ జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం కాదా? మార్చి 14న మచిలీపట్నంలో 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించబోతున్నాం. సభ కోసం అక్కడ రైతులు 34 ఎకరాల భూమి ఇచ్చారు. మరోసారి భూమి ఇచ్చిన రైతుల్ని భయబ్రాంతులకు గురి చేయడం కోసం కుట్రపూరితంగా చేస్తున్న కార్యక్రమం ఇది. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే జనసేన పార్టీ బలపరుస్తుంది. ఇలా సైకో పాలన చేస్తున్నారు కాబట్టే ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. మచిలీపట్నం ఆవిర్భావసభకు అన్ని రకాల అనుమతులు ఇస్తారని నమ్ముతున్నాం. మీడియా సమావేశం నిర్వహించే ముందు డీజీపీ గారికి లేఖ రాశాం. స్థానిక పోలీసులు వచ్చి ఆ ప్రదేశాన్ని పరిశీలించి వెళ్లారు. అనుమతులు ఇస్తారనే భావిస్తున్నాం. అడ్డుకోవాలని చూస్తే రాజకీయంగానే బుద్ది చెబుతాం.
• క్రియాశీలక సభ్యత్వం సామాన్యులకు చేరువైంది
రాజమండ్రిలో ఈ రోజు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆర్ధిక సాయం చేసేందుకు వచ్చాం. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు కుటుంబాలకు రూ. 30 లక్షలు అందచేశాం. ఈ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 12 కుటుంబాలకు రూ. 60 లక్షలు చెక్కుల రూపంలో అందచేశాం. పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా స్వీకరించి ఆపత్కాలంలో వారి కుటుంబాలకు భరోసా నింపేందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా అర్ధం చేసుకుని జనసేన క్రియాశీలక సభ్యులుగా మారుతున్నారు అని అన్నారు. పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, రాజమండ్రి, కాకినాడ నగర అధ్యక్షులు, వీర మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు.