‘ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ – వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం’పై జనసేన చర్చాగోష్టి
•25వ తేదీన మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వేదికగా…
•పాల్గొననున్న పవన్ కళ్యాణ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం 2013లో సబ్ ప్లాన్ చట్టం చేసి దేశంలో మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శనం చేశారు. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ శాఖల్లో నిధులు కేటాయించి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చేయూతను ఇవ్వాలన్నదే చట్టం ఉద్దేశం. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరుస్తోంది. ఇందుకు సంబంధించిన నిధులను ఇతరత్రా పథకాలకు మళ్లిస్తున్నారు. ఈ నెల 23వ తేదీతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం 10 సంవత్సరాల కాల పరిమితి ముగుస్తోంది. ఈ క్రమంలో ‘ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ – వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం’ అనే అంశంపై జనసేన పార్టీ చర్చా గోష్టి నిర్వహించనుంది. ఈ నెల 25వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11గం. నుంచి చర్చా కార్యక్రమం మొదలవుతుంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నాయకుడు, విశ్రాంత ఐ.ఏ.ఎస్.అధికారి శ్రీ డి.వరప్రసాద్ ఈ చర్చా గోష్టికి నేతృత్వం వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, వారి అభ్యున్నతి అంశాలపై సాధికారత ఉన్న మేధావులు ఈ చర్చకు హాజరై తమ పరిశీలనలను, అభిప్రాయాలను తెలియచేస్తారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , పార్టీ నాయకులు పాల్గొంటారు. ఉప ప్రణాళిక చట్టం ముఖ్యోద్దేశం కార్యరూపం దాల్చాలంటే రాష్ట్రంలో ఎంత పకడ్బందీగా అమలు చేయాలి, వాస్తవంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ఉప ప్రణాళిక అమలుపై జనసేన పార్టీ విధానం ఏమిటనేది ఈ సందర్భంగా తెలియచేస్తారు.