లారీ చక్రాలపై పన్నుల గుదిబండ!

• కొవిడ్ తర్వాత వరుసగా ట్యాక్సుల పెంపు
• తాజాగా త్రైమాసిక పన్ను పెంపునకు రంగం సిద్ధం
• చేయూతనివ్వక పోగా ఇబ్బందులు సృష్టిస్తున్న సర్కారు
• లబోదిబోమంటున్న లారీ యజమానులు
• రవాణా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

కొవిడ్‌ సమయంలో రవాణా రంగం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ప్రత్యక్షంగా ఈ రంగం మీద పెను ప్రభావమే పడింది. లక్షలాది కుటుంబాలు తినడానికి కూడా దిక్కులేని పరిస్థితిలోకి జారిపోయాయి. కొవిడ్ సమయంలోనూ… తర్వాత రోజుల్లోనూ రవాణా రంగానికి ఆంధ్రప్రదేశ్ లో చిన్న సహాయం కూడా అందలేదు. పన్నుల్లో మినహాయింపులు, ప్రోత్సాహం ఇవ్వని రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రవాణా రంగానికి చేయూతనివ్వడం దేవుడెరుగు… ఇప్పుడు ఆ రంగంపై ప్రభుత్వం పగ పట్టినట్లుగా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రానికి ఆర్థిక ఆదరవునిచ్చే రవాణా రంగంపై ఎడాపెడా పన్నుల భారం పెంచుతూ లారీ యజమానుల్లో ప్రభుత్వం భయోత్పాతం సృష్టిస్తోంది. కొవిడ్ పరిస్థితుల నుంచి ఇంకా కోలుకోని తమను ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందన్నది లారీ యజమానుల వేదన.
– రవాణా రంగంలో లారీ పరిశ్రమ ప్రధానమైంది. కొవిడ్ తరువాత కొద్దికొద్దిగా కోలుకుంటున్న తరుణంలో డీజల్‌ ధర, విడి భాగాల ధరలు పెరగడంతో పాటు ఇటీవల పెంచిన గ్రీన్ ట్యాక్స్‌ (హరిత పన్ను) ఆ రంగాన్ని దెబ్బకొట్టాయి. తాజాగా ప్రభుత్వం రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను 25 శాతం నుంచి 30 శాతం వరకు పెంచి రవాణా రంగం మీద మరో పెనుభారం మోపడానికి సిద్ధమైంది.
– రాష్ట్రంలో సరకు రవాణా లారీలు దాదాపు 2.50 లక్షలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, హిందూపురం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కర్నూలు, నెల్లూరు వంటి కీలకమైన నగరాల్లో సరకు లారీల సేవలు అధికం. మొత్తంగా ఇప్పుడు త్రైమాసిక పన్ను పెంపు కారణంగా లారీ యజమానులపై సగటున ఏటా రూ.60 కోట్ల భారం ప్రత్యక్షంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
– ముఖ్యంగా గూడ్స్‌ లారీ రవాణా వాహనాల యజమానుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై ఆధారపడిన కుటుంబాలు ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయాయి. మరోవైపు ఇటీవల పెరిగిన నిర్వహణ, ధరలు, టోల్‌ ప్లాజాల సంఖ్యతో లారీ యజమానులు ఇప్పటికే తమ వాహనాలను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా పన్ను పెంపు ప్రకటనతో రవాణా రంగంలో మిగిలి ఉన్న వారికి వణుకు పుడుతోంది.
– ఆరుచక్రాల లారీకి రూ. 3940 త్రైమాసిక పన్ను ఉంటే, దాన్ని రూ. 4970లకు, పది చక్రాల లారీకి రూ. 6580 ఉంటే దాన్ని రూ. 8390కు, 12 చక్రాల లారీకి రూ. 8520 ఉండగా దాన్ని రూ. 10,910కు, 14 చక్రాల లారీకి రూ. 11000 ఉంటే దాన్ని రూ. 13,500కు పెంచనున్నారు. ఈ లెక్కన ఏడాదికి ఒక లారీ యజమానిపై రూ. 5 వేల నుంచి రూ. 12 వేల వరకు భారం పడనుంది.
– ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హరిత పన్నును భారీగా పెంచింది. గ్రీన్ టాక్స్ మీద లారీ యజమానుల సంఘం ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా ఒకేసారి భారీగా హరిత పన్ను పెంచేసింది. రూ.200 పన్నును ఏకంగా రూ.20 వేలకు గరిష్టంగా పెంచేయడం మీద లారీ యజమానులు ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
– గతంలో వాహన ఫిట్ నెస్ చలనా రూ.920లు ఉంటే దాన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో అమాంతం పెంచేశారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు రూ.13,500లకు పెరిగింది. అలాగే కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై పన్ను శాతం 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. గతంలో రూ.30 లక్షల విలువైన లారీ కొనుగోలు చేస్తే దానిపై జీవిత పన్ను కింద రూ.3 లక్షలు కట్టేవారు. ఇప్పుడు అది ఏకంగా రూ.5 లక్షలు అయింది.
– కొవిడ్ అనంతరం రవాణా రంగం కోసం పొరుగు రాష్ర్టాలు పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. తమిళనాడులో వసూళ్లు చేస్తున్న త్రైమాసిక పన్ను మనకంటే చాలా తక్కువ. దీంతో పాటు గ్రీన్ ట్యాక్స్‌ కూడా మన రాష్ట్రంలో కంటే చాలా తక్కువ. అలాగే డీజిల్ మీద అక్కడి ప్రభుత్వం తగ్గింపులు చేసింది.
– డీజిల్ భారం రాష్ట్ర రవాణా రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. కేంద్రం ధరలు తగ్గించినా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చమురు ధరల తగ్గింపుపై ఉలుకుపలుకూ లేదు. కర్ణాటకకు, మనకు లీటరు డీజల్‌ ధరపై రూ. 10 వ్యత్యాసం ఉంది. దీంతో రాష్ట్ర పరిధిలో బాడుగకు వెళితే ఒక ట్రిప్పుకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు అదనపు భారం పడుతోంది.
– అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాద్యం, ధరల పెరుగుదలతో లారీల నిర్వహణ భారం బాగా పెరిగింది. లారీ విడిభాగాలు కొన్ని దాదాపు 5, 6 రెట్లు పెరిగాయి. గతంలో రూ. 100కు దొరికే విడిభాగం నేడు రూ. 500కు కొనాల్సి వస్తోంది. లారీ మరమ్మతులకు వస్తే రూ. లక్షల్లోనే ఖర్చు. ఒకపక్క నిర్వహణ గుదిబండగా మారుతుంటే, మరోపక్క ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మూలిగే నక్కపై తాడిపండు పడిన చందంగా మారుతున్నాయని లారీ యజమానులు వాపోతున్నారు.