అడ్డుకోవడానికి ఉన్న శ్రద్ధ… అండగా నిలవడానికెందుకుండదు?

* అమరావతి రైతుల కోసం పది నిమిషాలు సమయం కేటాయించలేని ముఖ్యమంత్రి
* ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అన్నది జనసేన విధానం
* గత ప్రభుత్వంలోనూ రైతుల తరఫున జనసేన పోరాడింది
* మూడు రాజధానులు తెర మీదకు తీసుకురావడం రాజకీయ క్రీడ
* ముళ్ల కంచెలు దాటి రైతుల కోసం నిలిచిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
* అమరావతి రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు
*తెనాలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

అమరావతి రైతుల సమస్యలు వినడానికి 10 నిమిషాల సమయం కేటాయించని ఈ ముఖ్యమంత్రి… వారు చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడానికి మాత్రం నానా రకాల తంటాలు పడుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. 1000 రోజులుగా అమరావతి రైతులు పోలీస్ కేసులకు భయపడకుండా, లాఠీ దెబ్బలకు వెరవకుండా, బెదిరింపులకు లొంగకుండా చేస్తున్న ఉద్యమం ఓ గొప్ప అధ్యాయం అని చెప్పారు. రాజధాని రైతులు రేపటి నుంచి చేపట్టే పాదయాత్రకు జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. తెనాలిలో ఆదివారం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు అనే విధానంలోనే జనసేన పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్టీ నాయకులతో చర్చించి ఒక విధానపరమైన నిర్ణయం పార్టీ తరఫున తీసుకున్నాం.. దానికి కట్టుబడి ఉన్నాం. అమరావతి రైతులు గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన పాదయాత్రకు సైతం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు జనసేన పార్టీ శ్రేణులు మద్దతు తెలిపాయి. సంఘీభావంగా పాదయాత్రలోనూ పాల్గొన్నాం. అధికారం చేపట్టిన దగ్గర నుంచి అమరావతి రైతుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం తీరును ప్రజలంతా గమనించాలి. మూడేళ్లలో అమరావతికి ఒక ఇటుక కూడా పేర్చని ఈ ముఖ్యమంత్రి, రాజధానిని అడ్డుకోవడానికి, అమరావతి రైతులకు ఆటంకాలు సృష్టించడానికి మాత్రం రకరకాల ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటు. ఒక పక్క న్యాయస్థానాలు చెబుతున్నా వినకుండా, మళ్ళీ మళ్ళీ మూడు రాజధానుల పాట పాడడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. కచ్చితంగా ఇలాంటి కుట్రలను జనసేన పార్టీ తరఫున అడ్డుకుంటాం.
* వైసీపీ పాలకులు రైతులను మోసం చేస్తున్నారు
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని ప్రగాఢంగా నమ్మిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. అమరావతి రైతులకు రకరకాల అడ్డంకులు సృష్టించి ఆనందపడుతున్నారు. గత ప్రభుత్వంలోనూ రైతుల తరఫున జనసేన పార్టీ పోరాడింది. స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి అప్పట్లో ప్రభుత్వాన్ని నిలదీశారు.భూ సేకరణ విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా జనసేన పార్టీ ముందడుగు వేసింది. గత ప్రభుత్వం అమరావతి కోసం సమీకరించిన 30 వేల ఎకరాల్లో భూములు ఇచ్చినవారు ఎక్కువగా రెండు ఎకరాలు, ఎకరా ఉన్న సన్న, చిన్నకారు రైతులే. వారిని కూడా ముప్పు తిప్పలు పెట్టేలా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఇవ్వని సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాల్లో పర్యటించారు. మూడు రాజధానులు అని ప్రకటించాక అక్కడి రైతులకు అండగా నిలిచేందుకు వెళ్తుంటే పోలీస్ అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలోను దేనికీ వెరవకుండా, భయపడకుండా ముళ్ల కంచెలు దాటి మరీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాదయాత్రగావెళ్లి రైతులకు పూర్తి భరోసా ఇచ్చారు. అలాగే ప్రతి సందర్భంలోనూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాలకు, పోరాటాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. ప్రత్యక్షంగా వారి ఉద్యమాల్లో పాల్గొన్నాం. అమరావతి రైతుల సమస్య కేవలం ఆ ప్రాంతానిది కాదు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సమస్య. ఆంధ్రులందరి సమస్య.
* మహా పాదయాత్రలో జనసేన శ్రేణులు పాల్గొంటాయి
సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అమరావతి రైతులు చేపట్టబోయే మహా పాదయాత్రకు జనసేన పార్టీ పూర్తి మద్దతును తెలుపుతోంది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో మహా పాదయాత్రకు మద్దతుగా నిలవాలి. రైతులకు అండగా నిలబడి పాదం కలపాలి. కచ్చితంగా రైతుల పాదయాత్రకు ఈ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఉంటుందని భావిస్తున్నాం. ఒకపక్క న్యాయస్థానంలో సైతం రైతుల పాదయాత్రకు సానుకూలమైన స్పందన రావడం శుభ సూచకం. దీనిపై ప్రభుత్వం కూడా తగు విధంగా పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మహా పాదయాత్రలో పాల్గొని రైతులకు అండగా నిలుద్దాం” అని శ్రీ మనోహర్ గారు అన్నారు. సమావేశంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, పార్టీ నేతలు దివ్వెల మధుబాబు, రమణరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *