26వ తేదీన రాజధాని రైతుల పాదయాత్రలో జనసేన

• పాల్గొననున్న పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, శ్రేణులు
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ సూచనల మేరకు పార్టీ పి.ఎ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ అధ్వర్యంలో జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జన సైనికులు – అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో ఈ నెల 26వ తేదీన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులు రాజధాని పరిరక్షణ కోసం పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్ర సాగుతోంది. 26వ తేదీ ఉదయం 10 గంటలకు నార్త్ రాజుపాలెం దగ్గర జనసేన బృందం రైతులను కలిసి సంఘీభావం తెలియ చేస్తారు. బుధవారం ఉదయం శ్రీ నాదెండ్ల మనోహర్ జిల్లాల అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ మాట్లాడుతూ “రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు తొలి నుంచి మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ అండగా ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పాలన మొదలైన తొలి యేడాదే కౌలు మొత్తం కూడా సకాలంలో ఇవ్వకపోతే రాజధాని గ్రామాలకు వెళ్ళి రైతుల పక్షాన నిలిచారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు పెట్టాక రాజధాని ప్రాంతానికి వెళ్తే ప్రభుత్వం ఆటంకాలు కల్పించినా కాలి నడకన వెళ్ళి రైతులకు ధైర్యం చెప్పారు. రైతులు తిరుపతి వరకూ చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రకు జనసేన మద్దతుగా నిలుస్తుంది. అందులో భాగంగా రైతుల పాదయాత్రలో 26వ తేదీన పాల్గొందాం” అన్నారు.