జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్, ప్రత్యేక గీతం విడుదల

జనసేన పార్టీ ఆవిర్భావ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. మార్చ్ 14వ తేదీ మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ మనోహర్ మాట్లాడుతూ.. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ పార్టీ వర్గాలు చేస్తున్న కార్యక్రమాలను జనసైనికులు, వీరమహిళలకు అంకితం ఇస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పోస్టర్ కు రూపకల్పన చేయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం ఇంఛార్జ్ కళ్యాణం శివశ్రీనివాస్, గుంటూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, షేక్ రియాజ్, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్, పార్టీ నేతలు అమ్మిశెట్టి వాసు, వడ్రాణం మార్కండేయబాబు, శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, శ్రీమతి ప్రియా సౌజన్య, సందీప్ పంచకర్ల తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక గీతం ఆవిష్కరణ

జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. “జన జన జన జనసేనా” అంటూ సాగే ఈ పాట ప్రత్యేకంగా మహిళా మణుల్ని ఉత్తేజపరిచే విధంగా రూపొందించినట్టు తెలిపారు.