తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన పార్టీ తెలంగాణ తరఫున స్వాగతిస్తున్నాం: శంకర్ గౌడ్

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ తెలంగాణ విభాగం తరఫున స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయం తప్పకుండా విద్యార్ధులకి ఊరటనిస్తుంది. విద్యార్ధుల భవిష్యత్తును, తల్లిదండ్రులు ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చదివిన విద్యార్థులను ఒత్తిడికి గురి చేసేలా ఫలితాలు ఉండటంతో నలుగురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయిన నేపథ్యంలో బాధ్యత గల రాజకీయ పార్టీగా జనసేన పార్టీ వారికి అండగా నిలిచింది. ఇంటర్ విద్యార్ధుల పక్షాన జనసేన పార్టీ విద్యార్థి విభాగం చేసిన పోరాటం అభినందనీయమని తెలంగాణ స్టేట్ జనసేన పార్టీ ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ తెలిపారు.