ప్రభుత్వంపై జనసేనాని ఫైర్

*నాలుగు జిల్లాలు అతలాకుతలం
*ఆస్తి, ప్రాణ నష్టం అపారం

*8 లక్షల ఎకరాల్లో పంట నష్టం
*ఏరియల్ సర్వే, సమీక్షలతో సరి….బాధితులను పరామర్శించని సీఎం
భారీ వర్షాలు, వరదలకు ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టంతోపాటు లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 6 లక్షల మంది వరద బారిన పడ్డారు. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని 1600 గ్రామాలతోపాటు, తిరుపతి, కడప పట్టణాలు వరదతో వణికిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరద విరుచుకు పడటంతో జనం ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీశారు. మరికొందరు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వరదలు తీవ్ర నష్టం మిగిల్చినా ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు జిల్లాల్లో వరదలకు అపార నష్టం జరిగినా సీఎం జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను పరామర్శించ లేదు. కేవలం హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి తాడేపల్లి వెళ్లిపోయారు. వరదల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సీఎం ఏరియల్ సర్వే చేసి, అనంతరం అధికారులతో సమీక్షించి వదిలేశారని బాధితులు విమర్శిస్తున్నారు. తమను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వరద బాధితులు వాపోతున్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి వెయ్యి రూపాయల సాయం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందనే విమర్శలు వస్తున్నాయి. ముందస్తు తుపాను హెచ్చరికలను ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్లే తీవ్ర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. వాయుగుండం సమాచారం ముందే వచ్చినా, ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వరదలు, భారీ వర్షాలకు నాలుగు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. జన సైనికులు వరద బాధితులకు భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాను త్వరలో వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులను పరామర్శించనున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.

వణికిన జనం
వాయుగుండం ప్రభావంతో నాలుగు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. వరదల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గల్లంతయ్యారు. నాలుగు జిల్లాల్లోని 1600 గ్రామాలు వరద బారిన పడ్డాయి. ప్రాధమిక అంచనాల ప్రకారం వరదలకు 2007 ఇళ్లు దెబ్బతినగా, 11 వేలకుపైగా ఇళ్లలో వరదనీరు చేరింది. ఇందులో 1,100 పైగా ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. నాలుగు జిల్లాల్లో 3,736 కి.మీ రహదారులు దెబ్బతిన్నాయి. కడప – కమలాపురం రహదారిలో పాపాగ్ని నదిపై వంతెన వరదలకు కొట్టుకు పోయింది. నెల్లూరు జిల్లాను వరదలు ముంచెత్తాయి. నెల్లూరు సమీపంలోని దామరమడుగు వద్ద చెన్నై – కలకత్తా 16వ నంబరు జాతీయ రహదారి వరదలకు కొట్టుకుపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 44,275 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వందల సంఖ్యలో విద్యుత్ స్థంభాలు నేలకొరగడంలో అనేక గ్రామాల్లో అంధకారం అలుముకుంది. పెన్నానదికి ఎన్నడూ లేని విధంగా 5 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో కరకట్టలు తెగిపోయాయి. బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, విడవలూరు మండలాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. చిత్తూరు జిల్లాను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమలలో వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 150 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా తిరుపతి, తిరుమలలో వరదలు ముంచెత్తాయి. వరదలకు కొండచరియలు విరిగిపడి తిరుమల కాలిబాట మార్గం మూసుకు పోయింది. కపిలతీర్థం ఆలయ మండపం అపార వర్షాలకు పాక్షికంగా కూలిపోయింది. తిరుపతిలో వందలాది కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు వారం రోజులుగా ముంపులోనే ఉన్నాయి. వేలాది మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అక్కడ కనీస వసతులు లేకపోవడంతో దాతలు పంపించే ఆహారం కోసం బాధితులు ఎదురుచూడాల్సి వస్తోంది.

పునరావాస కేంద్రాల్లో హాహాకారాలు
కడప, నెల్లూరు జిల్లాల్లో వరద ముంచెత్తడంతో వేలాది మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కడప జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఆహారం, మంచినీరు దొరక్క బాధితులు అల్లాడిపోతున్నారు. కడప జిల్లా రాజంపేట, నందలూరు మండలాల్లోని గ్రామాలను వరద ముంచెత్తింది. అనేక గ్రామాలు బురద, రాళ్లతో నిండిపోయాయి. పది అడుగుల మేర వరద ముంచెత్తడంతో వేలాది మంది కట్టుబట్టలతో మిగిలారు. పునరావాస కేంద్రాల్లో, ముంపు గ్రామాల్లో తినడానికి సరిగా తిండిలేక, తాగడానికి మంచినీరు లేక అల్లాడుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
రైతులకు కోలుకోలేని దెబ్బ
నాలుగు జిల్లాలపై వరదలు విరుచుకుపడ్డాయి. దీంతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 8 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ప్రాధమిక అంచనా. కోట్లాది రూపాయల విలువైన పశు సంపదకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, వేరుశనగ, పప్పు శనగ, మొక్కజొన్న, ఉల్లి, ఉధ్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అపార వర్షాలు, వరదలకు కూరగాయల పంటలు దెబ్బతినడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. క్యారెట్, బెండకాయ, దొండకాయ, బీరకాయలు ఇలా వేటిని కదిలించినా కిలో 40 నుంచి 70 రూపాయలపైనే పలుకుతున్నాయి. నాలుగు జిల్లాల్లో దాదాపు రూ.3,500 కోట్ల పంటనష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం
కడప జిల్లాలో అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది. దీంతో నందలూరు, రాజంపేట మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు సమీపంలోని పులపుత్తూరు గ్రామంలో వందకుపైగా ఇళ్లు ఆనవాళ్లు లేకుండా పోయాయి. చెయ్యేరు నది వరదలతో మందపల్లె గ్రామం బురద కుప్పలా మారింది. ఈ ఒక్క గ్రామంలోనే రూ.25 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. అనేక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టుల్లో కొన్ని మార్పులు చేయాలని జలవనరుల నిపుణులు సూచించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే పెను ప్రమాదం చోటుకుందనే విమర్శలు వస్తున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న ఐదు గేట్లు సరిపోవని గత ఏడాది అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. అదనపు గేట్లు ఏర్పాటు చేసి వుంటే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ఉండేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా వరదలకు పింఛ ప్రాజెక్టు రింగుబండ్ కొట్టుకుపోయింది. పింఛ ప్రాజెక్టుకు అదనపు స్పిల్ వే ఏర్పాటు చేయాలని గతంలోనే నిపుణులు సూచించారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. పింఛ ప్రాజెక్టు వల్ల ప్రమాదం పొంచి ఉందని గతంలోనే జనసైనికులు కూడా అధికారులకు తెలిపారు. అయినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రాజెక్టుకు అంచనాల కంటే ఎక్కువ వరద వస్తోందని సరైన హైడ్రాలజీ అధ్యయనం జరపకుండా నిర్మించారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పింఛ ప్రాజెక్టు స్పిల్ వే పెంచకుంటే ఎప్పుడైనా ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి తీవ్ర నష్టం వాటిల్లేది కాదనే విమర్శలు వస్తున్నాయి.

కబ్జా కోరల్లో చెరువులు….తిరుపతి కాలనీలు జలమయం

చిత్తూరు జిల్లాను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా, తిరుపతి, చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో వరద నష్టం తీవ్రంగా ఉంది. రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు ప్రమాదకరంగా మారింది. కరకట్ట నుంచి నీరు లీకవుతోంది. 1000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు సామర్థ్యం 0.580 టీఎంసీలు కాగా ఒక్కసారిగా 0.920 టీఎంసీల వరద వచ్చింది. దీంతో చెరువు కట్టకు ప్రమాదం ఏర్పడింది. రాయల చెరువుకు ప్రమాదం ఏర్పడటంతో 19 గ్రామాల్లోని 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తాయి. చెరువులు కబ్జాకు గురికావడంతో వరద నీరు తిరుపతి పట్టణాన్ని ముంచెత్తింది. తిరుపతిలో చాలా కాలనీల్లోకి వరద నీరు చేరింది. రుయా, ఈ.ఎస్.ఐ ఆసుపత్రిలో కూడా వరద నీరు చేరడంతో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రకృతి విపత్తులను ఎవరూ అడ్డుకోలేరు, కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తినష్టం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించక పోవడం, నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టులను నిర్వహించక పోవడం వల్లే వరదలకు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.