సేవా కార్యక్రమాలతో జనసేనాని జన్మదినం

జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు: జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించనున్నట్టు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ అందజేయనున్నామన్నారు. దివ్యాంగులకు సహాయం చేయడంతో పాటు, రెల్లి కాలనీల్లో సహపంక్తి భోజనాలు చేయనున్నామని తెలిపారు. బైక్ ర్యాలీలు, కేక్ కటింగ్ లతో సమయం వృధా చేయకుండా.. సామాజిక సేవా కార్యక్రమాలతో పుట్టిన రోజు వేడుకలకను ఘనంగా నిర్వహించబోతున్నామని ప్రకటనలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.