ఒక్కసారి జనసేన వైపు చూడండి.. వ్యవస్థల్ని బలోపేతం చేస్తాం

•అప్పులు లేని రాష్ట్రంగా ఆర్ధిక పురోగతి సాధిస్తాం
•అందర్నీ కలిపి ఉంచే ఆలోచనా విధానంతో ముందుకు వెళ్తుంది
•జనసేన కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయదు
•ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం రాజ్యాంగ విరుద్దం
•ఎస్సీ, ఎస్టీల మీదే అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు
•శాంతిభద్రతలు కరవైతే సమాజం క్షీణిస్తుంది
•రాష్ట్ర సీఎంకి ఏపీ పోలీసులపై ఇప్పటికీ నమ్మకం లేదు
•మళ్లీ వైసీపీకి అధికారం ఇస్తే ఉపాధి అవకాశాలు కోల్పోతాం
•ఇసుక బంగారం అయిపోతుంది
•ఆడబిడ్డల మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు
•ఇప్పుడు కేసులుపెట్టి వేధిస్తే… మీపైనా కేసులు పెట్టే రోజులు వస్తాయి
•స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి… వ్యవస్థలను బలోపేతం చేసి, రాష్ట్రానికి ఆర్థిక పురోగతిని తీసుకొస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. కుటుంబం కంటే దేశం అంటే ఇష్టమని… అలాంటి దేశంపై ఒట్టు వేసి చెబుతున్నాను తుదిశ్వాస వరకు రాజకీయాలను వదలను అన్నారు. సోమవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన దేశ స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జనసైనికులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రతి ఒక్కరికీ భారత 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం రోజు మనమంతా సరదాగా కేరింతలతో ఉత్సాహంగా చేసుకొంటాం. త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి సరిపెట్టుకుంటాం. నా వరకూ దీని వెనుక బాధ్యత ఎంతో ఉంటుంది. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం దేశం మొత్తం స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే పక్క రాష్ట్రం తెలంగాణకు సంవత్సరం ఆలస్యంగా స్వతంత్రం వచ్చింది. నిజాం పాలనలో ఉన్న వాళ్లు పాకిస్థాన్ దేశంలో చేరాలా? ఇండియన్ యూనియన్ లో చేరాలా? అప్పటికి నిర్ణయించుకోలేదు. ఒక వైపు నిజాం మద్దతు ఉన్న రజాకార్లు- ఆడపడుచులతో నగ్నంగా బతుకమ్మ పండుగ చేయించిన కాలం. స్వతంత్రం చాలా రక్తపాతంతో సిద్ధించింది. ఇది ఒక రోజు మొక్కుబడిగా చేసుకునే పండుగ కాదు. మొక్కుబడి తంతుగా చేసే ఆలోచనా విధానం జనసేనకుగాని, నాకుగాని లేదు. మూడు రోజులు తిరంగా ర్యాలీలు చేయడం కాదు.. 365 రోజులు స్వాతంత్ర్య ఉద్యమం తాలూకు స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవాలి. కడ శ్వాస వరకు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. దేశ విభజన సమయంలో 2 కోట్ల మంది పాకిస్థాన్ నుంచి వలస వెళ్లారు. మానవ చరిత్రలో ఈ స్థాయిలో వలసలు ఎప్పుడూ జరగలేదు. 17 లక్షల మంది మనుషులు చనిపోయారు. మతోన్మాదంతో రెండు వైపులా ఊచకోత కోశారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్ర్యం వచ్చింది. ముక్కు ముఖం తెలియని వారు, గుర్తింపు కోరుకోని వారు ఎంతో మంది భావితరాలు బాగుండాలని వారి జీవితాలను త్యాగం చేశారు. అలాంటివారి స్ఫూర్తితో జనసేన పార్టీ ముందుకు వచ్చింది.
•వీరుల త్యాగాలను తేలిగ్గా తీసుకుందామా?
ఏదో రాజకీయాల్లోకి వచ్చాం.. పార్టీ పెట్టేశాం అనే తేలికపాటి ఆలోచనా విధానం నాకు లేదు. భావితరాలు ఎలా ఉంటాయో తెలియని వ్యక్తులు వారి సర్వస్వాన్ని త్యాగం చేశారు. భగత్ సింగ్ మన కోసం 23 ఏళ్ల వయసులో ఉరి కంబానికి ఎక్కారు. మనమంతా కీర్తించే నేతాజీ విమానంలో జరిగిన అగ్నిప్రమాదంలో మంటల్లో దహించుకుపోయారు. వీరి త్యాగాలను మనం తేలిగ్గా తీసేసుకున్నాం. నామటుకు పార్టీ మొదలు పెట్టడానికి ముఖ్య కారణం మన స్వతంత్ర ఉద్యమకారుల త్యాగాలు. ఏ పార్టీ సైద్ధాంతిక బలం లేకుండా ముందుకు వెళ్లదు. కేవలం ఒక కులం మీదో, మతం మీదో, ఒక ప్రాంతీయ వాదంతో పార్టీలు పెడితే దాని మనుగడ కొంత వరకే ఉంటుంది. స్వతంత్రం కోసం పోరాటం చేసిన నాయకులెవ్వరూ కులం కోసమో, మతం కోసమో పోరాటం చేయలేదు. అలాంటి మహానుభావుల స్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నాను. స్వతంత్ర పోరాటం చేసిన వారంతా కులాలు, మతాలకు అతీతంగా పోరాటం చేశారు. విడిపోవడానికి ఎప్పుడూ ప్రజలు సిద్ధంగా ఉండరు. విడగొట్టడం తేలిక.. కలసి ఉంచడమే కష్టం.. జనసేన ఎప్పుడూ అందర్నీ కలిపి ఉంచేందుకే ప్రయత్నిస్తుంది. అది మతపరంగా కావచ్చు. కులపరంగా కావచ్చు. అంబేద్కర్ గారు చెప్పిన విధంగా కులం తాలూకు ఆలోచన పోవాలి అంటే అది సుదూర లక్ష్యం. కులాలను కలిపే ఆలోచనా విధానం. మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలి. భాష యాసల్ని గౌరవించే సంప్రదాయం కావాలి. భారత దేశం అంతా ఒక్కటిగా ఉండాలన్న లక్ష్యంతో ఈ సిద్ధాంతాలు తీసుకువచ్చా.
•అవినీతి నేతలపై రాజీలేని పోరాటం
రాష్ట్ర విభజనకు భాష, యాసలే కారణమయ్యాయి. మా సదర్ ఉత్సవాలను గుర్తించాలి అని తెలంగాణవాసులు బలంగా కోరుకున్నారు. ప్రాంతీయతను విస్మరిస్తే దేశమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. చాలా ప్రాంతాల్లో దక్షిణాది వేరు, ఉత్తరాది వేరు అనే వాదనలు వినిపిస్తూ ఉంటాయి. ప్రాంతాలను విస్మరిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భావనతోనే ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం ఉండాలని భావించాం. ఈ రోజున అంతా స్వతంత్ర ఉద్యమకారుల విగ్రహాలకు దండలు వేస్తాం. చాలా మంది రాజకీయ నాయకులు అవినీతిలో కూరుకుపోయారు. అలాంటి అవినీతి నాయకులపై రాజీలేని పోరాటం చేయాలన్న బలమైన కోరిక ఉంది. భవిష్యత్తుకు పర్యావరణం చాలా కీలకమైంది. అభివృద్ధి ఉండాలి. అయితే పర్యావరణాన్ని సర్వనాశనం చేసే అభివృద్ధితో ఉపయోగం లేదు. విశాఖలో పరిశ్రమల కాలుష్యం, ఆక్వా కల్చర్ వల్ల డబ్బులు వస్తున్నాయిగాని సంపూర్ణంగా నేల తల్లి కాలుష్యం బారినపడుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. ఆ మూల సిద్ధాంతాలతోనే ముందుకు వెళ్తుంది.
•మసీదు, చర్చిల గురించి మాట్లాడి ఆలయాలను విస్మరిస్తే ఎలా?
ఇవాల్టి రోజు మీతో పంచుకోవాల్సిన ప్రధాన అంశం సెక్యులరిజం. జనసైనికులు, మహిళా నాయకులకు, ఆడపడుచులకు ఒకటే చెబుతున్నా ఓటు బేస్డ్ సెక్యులరిజం జోలికి పోవద్దు. ఒక కులం కావచ్చు.. మతం కావచ్చు.. ప్రాంతం కావచ్చు.. భారత దేశ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేది ఏదైనా అంతా ముక్త కంఠంతో ఖండించాలి. ఒక మసీదుని అపవిత్రం చేస్తే ఎంత బలంగా ఖండిస్తామో.. ఒక చర్చికి అపవిత్ర జరిగితే ఏ రకంగా ఖండిస్తామో.. ఒక హిందూ దేవాలయానికి అపవిత్రం జరిగినా అంతే బలంగా ఖండిస్తేనే అది సెక్యులరిజం అనిపించుకుంటుంది. మసీదు.. చర్చిల గురించి మాట్లాడి దేవాలయాలను విస్మరిస్తే అది సెక్యులరిజం అనిపించుకోదు. మన మధ్య ఎన్ని వైషమ్యాలు ఉన్నా ఎవ్వరూ దేశాన్ని కించపర్చే వ్యాఖ్యలు చేయరాదు. భారతీయ సంస్కృతి ఈ దేశం తాలూకు వెన్నెముక. ఆ భారతీయ సంస్కృతికి విఘాతం కలిగించేది ఏదైనా సరే మనమంతా ముక్త కంఠంతో ఖండించాలి. మనకు ఓట్లు పడకపోయినా ఫర్వాలేదు. నిజాయతీగా రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తే ప్రజల్లో మార్పు వచ్చిన రోజున ఖచ్చితంగా ఆదరిస్తారు. అయ్యప్పస్వామి దేవాలయ ప్రవేశం గురించి లోతైన చర్చ చేస్తారు.. అది సెక్యులరిజం. మరి మిగతా మత విశ్వాసాల గురించి మాత్రం మాట్లాడరు. కన్వినియెంట్ గా సెక్యులరిజం అంటే ఎలా? అందరి మీదా ఒకే విధంగా స్పందించాలి. భారతీయ సంస్కృతిని ఎవరు విమర్శించినా దాన్ని సెక్యులరిజంగా భావించం. అలా అవకాశవాదంతో మాట్లాడే వారు ఎక్కడ ఉన్నా వారిని ముక్తకంఠంతో ఎదుర్కోవాలి. దాన్ని మన సంస్కృతి మీద దాడిగానే భావిస్తాం. రామతీర్థంలో రాములవారి విగ్రహానికి తల నరికేశారు. జనసేన పార్టీ దాన్ని ప్రభావవంతంగా ఖండించింది. ప్రతి మతాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవించాలి.
•రాజకీయాల్లో కులాల పేరిట తిట్టుకోవడం ఏంటి?
రాజకీయ వాతావరణం కులాల పేరిట తిట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మధ్య ఒక ఉత్తరాంధ్ర నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జనసేన పార్టీ ఒక సామాజికవర్గాన్ని ఎవరికో కుదువ పెట్టేందుకు ప్రయత్నిస్తోందంటున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే నేను గుండెల నిండా జాతీయ భావం, రాజ్యాంగ స్ఫూర్తిని నింపుకున్న వాడిని. ఒక కులం మీద రాజకీయం ఎప్పుడూ సాధ్యం కాదు. ప్రతి పార్టీకి మద్దతుదారులు ఉంటారు. నేను సోషలిస్ట్ భావాలతో పెరిగాను. కులం, మతం, ప్రాంతం అన్న భావనలు తెలియకుండా పెరిగాను. కులాల గురించి మాట్లాడడం ఇష్టం లేకుండా వచ్చా. కానీ అది మన సమాజం తాలూకు మూల లక్షణం కాబట్టి మాట్లాడుతాను. నేను మాట్లాడేప్పుడు వైద్యుడు వ్యాధి నిర్ధారణ చేసిన చందంగా మాట్లాడుతాను. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న మాటల ప్రకారం నిజంగా నేను ఒక కులానికి చెందిన వాడినైతే… ఆ కులం మొత్తం నాకు ఓటు వేసి ఉండాలి. అలా ఓటు వేసి ఉంటే జనసేన పార్టీకి తక్కువలో తక్కువ 40-50 సీట్లు వచ్చి ఉండాలి. నేను కుల నాయకుడ్ని కాదు. ప్రజలందరికీ సంబంధించిన నాయకుడిని. వైసీపీ నాయకుడికి ఒకటే చెబుతున్నా… మీ భావాలు నా మీద రుద్దకండి. నేనలాంటి వ్యక్తిని కాదు.. ఈ రోజు వరకు నా స్నేహితులెవర్ని ఏ మతం, ఏ కులం అని చూడలేదు. నాకు అత్యంత దగ్గర వ్యక్తి ఆనందసాయి కులం ఏంటో మూడునాలుగేళ్ల క్రితం వరకు నాకు తెలియదు. యాదగిరి గుట్ట ఆర్కిటెక్ట్ గా ఉన్నప్పుడు బీసీ కులం అని తెలిసింది. రాజకీయాల్లో కేవలం కులం మీద ఆటాడితే ఎందుకు నష్టపోతామంటే… అణగారిన వర్గాల కోసం మొదలైన కాన్షీరామ్ బహుజన సమాజ్ వాదీ పార్టీ చివరికి ఏ బ్రాహ్మణ సమాజాన్ని వ్యతిరేకించారో.. అదే బ్రాహ్మణ సమాజంతో చేతులు కలపాల్సి వచ్చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కులాలను కలిపే ఆలోచనా విధానంతో ముందుకు వచ్చాం. మనం ఒక కులం కోసమే పని చేస్తే ఆ కులానికి కూడా చెడు చేసిన వారమవుతాం. వైసీపీ నాయకులు జనసేనను ఒక కులానికి అంటగట్టాలనుకుంటే తప్పు చేసినట్టే. మీ మాటలు వెనక్కి తీసుకోండి.
•నేను ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు నాతో నడవండి
ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుడు ఒకరు నాతో పాదయాత్రకు రండి.. రాష్ట్రం మొత్తం తిరగండి.. అంటున్నారు.. నేను ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంత సమస్యల మీద రోడ్డు మీదకు వస్తాను. మీరు నాతోపాటు నడవండి. ఎక్కువ అడుగులు వద్దు మూడు అడుగులు వేయండి చాలు. ఆ తర్వాత ఆ మాటలు మాట్లాడండి. విమర్శించే ప్రతి నాయకుడికీ నేను ధీటుగా బదులివ్వగలను. మీ పెద్దరికం, అనుభవం తెలిసినవాడిని కాబట్టి జాగ్రత్తగానే మాట్లాడుతా. అయినప్పటికీ మీరు పదే పదే మాట్లాడితే నేను కూడా మీకంటే ఘాటుగా నోరు విప్పాల్సి వస్తుంది.
•జనసేన అందరికీ డబ్బు వచ్చే ఏర్పాటు చేస్తుంది
75 సంవత్సరాల క్రితం పరిస్థితులకు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అప్పట్లో విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు 500 డాలర్లు ఇచ్చేవారు. ఇప్పుడు లక్ష డాలర్లు ఇచ్చేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆ అభివృద్ధి అందరికీ సమంగా అందడం లేదు. డబ్బు కొందరి దగ్గరే ఉండిపోతుంది. దేశం అభివృద్ధి చెందుతుంది గాని డబ్బు కొందరి దగ్గరే ఉండిపోతుంది. జనసేన పార్టీ డబ్బు అందరిదగ్గర ఉండాలని కోరుకుంటోంది. మన వైసీపీ నాయకుల్లాగా రాష్ట్రానికి లక్ష కోట్లు ఆదాయం వస్తుంటే… ఇసుక వనరులు అమ్మేస్తున్నారు.. ఖనిజాలు అమ్మేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గాన్నే తీసుకుంటే- అంతకు ముందు గుడివాడలో ఇసుక తోలడానికి, ఇతర రవాణాకు 350 ట్రాక్టర్లు ఉండేవి. ఈ రోజున వారికి పని లేకుండా పోయింది. ఆ స్థానంలో ఇప్పుడు 150 ట్రక్కులు పని చేస్తున్నాయి. 20 టన్నులు తీసుకువెళ్లే ట్రక్కుల్లో 40 టన్నులు వేస్తున్నారు. ఆ డబ్బు మొత్తం వైసీపీ ఎమ్మెల్యేకి వెళ్తుంది. జనసేన వస్తే ఆ 350 మంది ట్రాక్టర్ల ఓనర్లకు డబ్బు వచ్చే ఏర్పాటు చేస్తాం.
•షణ్ముఖ వ్యూహం లక్ష్యం అదే
అభివృద్ధి అంటే కేవలం నా కులానికి, వర్గానికి అన్న చందంగా ఉండరాదు. ఉదాహరణకు రెల్లి కులస్తులకు ఈ రోజుకీ అభివృద్ధి లేదు. బుడగ జంగాలు మమ్మల్ని గుర్తించమని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బీసీల చరిత్ర అనే పుస్తకం చదువుతుంటే బోయలు- నేతల పల్లకీలు మోయడానికి తప్ప రాజకీయ ఉనికి లేదనీ, రకరకాల పరిస్థితుల్లో కేసులు ఎదుర్కొంటున్నాం అని ఓ బోయ నాయకుడు రాసిన మాటలు కనువిప్పు కలిగించాయి. ఈ రోజుకీ దళిత కులాలను ఓట్లు వేసేయండి.. వెళ్లిపోండి.. మంత్రి పదవులు ఇస్తాం నోరు విప్పొద్దు అనే స్థాయిలో ఉన్నారు. దామోదరం సంజీవయ్య గారు లాంటి మహానుభావులు పుట్టిన దళిత కులాల నుంచి మరింత మహోన్నతమైన నాయకులు రావాలని, వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని జనసేన కోరుకుంటుంది. రాజకీయ నాయకులు ఒక ఎలక్షన్ కి రూ.150 కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థాయిలో ఉన్నారు. జనం మాత్రం రూ.10 వేలకి, రూ.5 వేలకి నలిగిపోతున్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా ఎంత మంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో తెలుసుకున్నాం. ఫించన్లు కూడా రాని పరిస్థితి. ఒక వైపు వందల కోట్ల డబ్బులు. ఇంకో వైపు రెండు వేలకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు. యువతకు సైతం ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి యువకుడికి రూ.పది లక్షల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం. ఈ పథకానికి ఏటా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. అది ఎలా సాధ్యమని అడగొచ్చు. రాష్ట్రంలో ఎంతో మంది ఐటీ నిపుణులు ఉన్నారు. మంచి యాప్స్ తయారు చేసే సత్తా వారి దగ్గర ఉంటుంది. కాని పెట్టుబడి ఉండదు. పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం సహకరిస్తే. వారు ప్రభుత్వానికి ఎన్నివేల కోట్లు తిరిగివ్వగలరో మనం ఊహించలేం. ప్రతిభ ఉన్న యువతీ యువకుల్ని గుర్తించాలన్నదే జనసేన షణ్ముఖ వ్యూహంలో రూ.10 లక్షల పెట్టుబడి ఆలోచన. దివ్యాంగుల్ని ప్రత్యేకంగా చూడాలి. వారికి రెండు వేలు ఇచ్చి వదిలించుకోకుండా వారిలో ఉన్న విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించాలి. వారి కోసం ప్రత్యేకంగా కొంత నిధి కేటాయించే విధంగా ఆలోచన చేస్తున్నాం. వారు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలి. మన నాయకులంతా బయట దేశాల్లో కూడా ఏం జరుగుతుందో అధ్యయనం చేయాలి. అప్పుడే మనం బలమైన పాలసీలు తయారు చేయగలం. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వల్ల యూరియా ధరలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్ని ముందే గ్రహిస్తే ప్రత్యామ్నాయ సరఫరా చూసుకునే అవకాశం ఉంటుంది. కనీసం మన పక్క దేశాల్లో ఏం జరగుతుందో ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. దేశ సరిహద్దులు దాటి ఆలోచిస్తేనే ప్రభావం చూపగలం.
•కోడి కత్తి కేసు ఏమైంది?
లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే.. జనసేన పార్టీ వ్యవస్థల్ని బలోపేతం చేసే పార్టీ. వైసీపీ అధికారంలోకి రాక ముందు 2019లో విశాఖ ఎయిర్ పోర్టులో నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత మీద కోడి కత్తితో దాడి జరిగినప్పుడు ఆయన గగ్గోలు పెట్టేశారు. ఆ దాడిపై నేను ఖండన ఇచ్చాను. నా మీద దాడి జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని నమ్మలేను.. ప్రభుత్వాసుపత్రిని, వైద్యుల్ని నమ్మలేనని హైదరాబాద్ లో వైద్యం చేయించుకున్నారు. అప్పటి గవర్నర్ శ్రీ నరసింహన్ గారిని ఒప్పించి కేసు కూడా అక్కడే పెట్టారు. అలా అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి మూడేళ్లు గడిచిపోయింది. ఆయనకి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం రాలేదనుకుంటా. ఇప్పటికీ కోడి కత్తితో ఎవరు పొడిచారో బయటికి రాలేదు. అలాంటి వ్యక్తి దిశ యాప్ పెట్టేసి ఆడపిల్ల మాన మర్యాదలకు భంగం కలిగిస్తే రెండు వారాల్లో శిక్షిస్తామని చెప్పేశారు. ఆ మాట ఈ రోజుకీ అలాగే ఉంది. భారత దేశపు శిక్షా స్మృతి ప్రకారం 14 రోజుల్లో శిక్ష విధించలేని పరిస్థితి. అది తెలిసి కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి మాయాజాలం చేసి దిశ యాప్ లో పెడితే అద్భుతాలు జరిగిపోతాయని చెబుతున్నారు. లా అండ్ ఆర్డర్ నిజంగా బలంగా లేకపోతే సమాజం క్షీణించిపోతుంది. ఈ మధ్య చిత్తూరు జిల్లాలో జనసేన కార్యకర్తల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. దళితుల మీద కూడా అట్రాసిటీ యాక్ట్ పెట్టే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయింది. చట్టాలను దుర్వినియోగం చేసుకుంటూ వెళ్లిపోతే అవి నిష్ప్రయోజనం అయిపోతాయి. గతంలో టాడా చట్టం కూడా అలాగే తీసేయాల్సి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు విషయంలో ప్రభుత్వాలు, పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాను. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎవరి మీద అన్యాయంగా పెట్టినా దాన్ని ముక్త కంఠంతో ఖండించాలి. మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నాను.
•జనసేన పార్టీ ప్రజల్ని అందలం ఎక్కిస్తుంది
జానీ సినిమాలో రావోయి మా కంట్రీకి లైఫున్నది బొంబడి లైఫున్నది.. తినడానికి బ్రౌన్ షుగరు మందున్నది తాగడానికి సర్కారు సారున్నది. అన్న పాటలో కంట్రీ అన్న పదాన్ని సెన్సార్ వాళ్లు ఒప్పుకోలేదు. ఈ రోజు అయితే రావోయి మా రాష్ట్రానికి అనొచ్చా అని సెన్సార్ వారిని అడిగేవాడిని.. రావోయి మా రాష్ట్రానికి తాగడానికి గంజాయి.. తాగడానికి ప్రభుత్వ వైన్ షాపులు ఉన్నాయి అని పెట్టవచ్చా అని. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతాము. ఇసుక బంగారమైపోతుంది. ఆడబిడ్డల మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు. ఇవన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఓటు వేయండి. జనసేన పార్టీని స్థాపించింది ఏ పార్టీనో అందలం ఎక్కించడానికి కాదు. ప్రజలను అందలం ఎక్కించడానికి. వైసీపీ అద్భుతమైన పాలన అందించి ఉంటే… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చను అనే మాట మాట్లాడేవాడిని కాదు. అధికారంలోకి రాగానే యువతకు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఇవ్వలేదు. ఆడబిడ్డల మాన, ప్రాణాలకు భంగం వాటిల్లితే ఎవరో పొరపాటున చేశారు అంటారు. నిజాయతీగా పనిచేసే అధికారులను బదిలీ చేస్తారు. ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కనుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నాను.
•మీ ప్రేమాభిమానాల్ని తాకట్టు పెట్టను
వాళ్ల దగ్గర వేల కోట్లు, సిమెంటు ఫ్యాక్టరీలు ఉండొచ్చు… మనం 8 జీపులు కొంటే మాత్రం డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి అని అడుగుతున్నారు. 25 కోట్లు ట్యాక్సు కట్టేవాడిని.. కోటిన్నర బ్యాంకుల నుంచి రుణం తీసుకొచ్చి 8 కార్లు కొనలేనా? మీరు మాత్రమే పార్టీ పెట్టడానికి అర్హులు. మేము మాత్రం పార్టీ పెట్టకూడదా? ఇంత ప్రజాభిమానం ఉన్న నన్నే ఇన్ని మాటలు అంటుంటే… ఇక బీసీ, దళిత కులాల నుంచి వచ్చే నాయకులను వీళ్లు ఎలా చూస్తారు? రెల్లి, శెట్టిబలిజ, కాపులను ముఖ్యమంత్రి కానిస్తారా? మీకు తప్ప ఎవ్వరికీ రాజకీయ సాధికారిత రాకూడదు అంటే ఎలా? జనాభా పెరుగుతోంది. జ్ఞానం పెంచుకొని మారండి. వాళ్ల చుట్టు ఎవరున్నా వాళ్ల కులం చూడకూడదు. మన పక్కన ఉన్నవాళ్లకు మాత్రం వీళ్లు కులం అంటగడతారు. పదవే కావాలనుకుంటే 2009లోనే ఎంపీ అయిపోయేవాడిని. ప్రధాన మంత్రి దగ్గర చనువు ఉంది. ఆ చనువుతో రాజకీయ గుర్తింపు ఇవ్వండి అని అడిగితే ఇవ్వరా? కానీ మీ ప్రేమాభిమానాలను నేను తాకట్టు పెట్టను. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ డంపింగ్ యార్డుకు స్థలం ఇస్తే… స్థానిక ఎమ్మెల్యే ఒకరు రాత్రికి రాత్రే ఆయన్ను బదిలీ చేయించారు. నిజాయతీగా పనిచేసే అధికారులను ఈ ప్రభుత్వం పక్కన పెట్టేస్తోంది. స్థానిక సంస్థల్లో నిజాయతీగా పనిచేసే ఒక అధికారిని హింస పెట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభుత్వంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తాం. నిజాయతీగా పనిచేసే అధికారులను అందలం ఎక్కిస్తాం. భీమ్లా నాయక్ సినిమాను ఆపడానికి చిన్నస్థాయి రెవెన్యూ అధికారి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు పని చేయించావు… విధ్వంసాలకు వ్యవస్థలను వాడుకొన్నవాడివి. అలాంటిది దివ్యాంగులను ఆదుకోవడానికి, యువతకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడానికి ఎందుకు వ్యవస్థను వాడవు? మనం అద్భుతాలు చేయాల్సిన పనిలేదు. మన రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని, పక్షపాతం లేకుండా అమలు చేస్తే చాలు. అద్భుతాలు అవే జరుగుతాయి.
•ఇక్కడ వేసే వేషాలు శ్రీ మోడీ ముందు వేయమనండి
అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి అంటారా? మీరు అధికారంలోకి వచ్చాక యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఇవేవి చేయకుండా అభివృద్ధి అంటారు. ఢిల్లీలో ఒకొక్క ఎంపీ ఏం మాట్లాడతారో మాకు తెలియదా? వీళ్ల వేషాలన్ని మన దగ్గరే. మోడీ గారి ముందు వేయమనండి కరెక్టుగా చెబుతారు. రాజ్యాంగ రూపకల్పనలో ఎంతో తపనపడ్డ అంబేద్కర్ గారు లాంటి వ్యక్తులు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. సమాజం నాది… ప్రజలు నా వాళ్లు అనుకుంటే ఓటమి పెద్దగా బాధించదు. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యేలు ఒకటే గుర్తించుకోవాలి. మీరు సామాన్యులే, పై నుంచి దిగి రాలేదు. మీరు ఈ రోజు దాడి చేస్తే ప్రజలు మీ మీద దాడి చేసే రోజులు వస్తాయి. మీరు ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తే… మీ మీదా కేసులు పెట్టే రోజులు వస్తాయి. గూండాలు మీకే అంత తెగింపు ఉంటే దేశభక్తులం మాకెంత తెగింపు ఉండాలి. మేము గాంధీ గారి వారసులం కాదు. సుభాష్ చంద్రబోస్ వారసులం. గాంధీ గారి స్ఫూర్తి, ప్రేమతత్వం గుండెల్లో ఉంటుంది తప్ప … ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడంలో కాదు. మీరు ఒకటి కొడితే మేము నాలుగు కొడతామ”న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *