కన్నెగంటి హనుమంతు పోరాయస్ఫూర్తి ఆదర్శనీయం

  • మాజీమంత్రి కన్నాలక్ష్మీనారాయణ

గుంటూరు: రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తూ ప్రముఖ స్వతంత్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు జరిపిన పోరాటస్ఫూర్తి ఆదర్శనీయమని మాజీమంత్రి, టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం కన్నెగంటి హనుమంతు 102వ వర్ధంతి సందర్భంగా చుట్టుకుంట సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలోని అడవుల్లో పుల్లలు ఏరుకోవడంపై, పశువుల మేతపై చివరికి చెట్ల ఆకులపై కూడా బ్రిటీష్ పాలకులు పన్ను విధించటాన్ని కన్నెగంటి తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. మహాత్మాగాంధీ స్పూర్తితో పుల్లరి ఉద్యమంతో బ్రిటీష్ పాలకులపై తిరగబడ్డారన్నారు. ఈ చెట్టు నువ్వు పెట్టావా? విత్తు నువ్వు నాటావా? నారు నువ్వు పోశావా? నీరు నువ్వు పెట్టావా? మా నేలపై నీ పెత్తనం ఏమిటంటూ పిడుగుల్లాంటి ప్రశ్నలతో బ్రిటీష్ పాలకులపై సింహ గర్జన చేసిన గొప్ప దేశభక్తుడు కన్నెగంటి అంటూ కొనియాడారు. బ్రిటీష్ పాలకులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కన్నెగంటి లొంగలేదన్నారు. నా దేశ ప్రజల్ని మోసం చేసే ఆ రక్తపు కూడు నాకొద్దు అంటూ ఈ దేశం కోసం తన తుది శ్వాస వరకూ పోరాడిన కన్నెగంటి చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం ఈ మధ్యనే పరమపదించిన విగ్రహ కమిటీ చైర్మన్ ముమ్మలనేని మాధవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విజేత హరి, దాసరి శ్రీనివాస్, దాసరి వెంకటేశ్వరరావు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్, అడపా మాణిక్యాలరావు, తాళ్ళ వెంకటేష్ యాదవ్, అడకా శ్రీను, ఆళ్ళ హరి, వీరిశెట్టి సుబ్బారావు, దాసరి లక్ష్మీ దుర్గ, యర్రంశెట్టి పద్మావతి, పార్వతి నాయుడు, బిట్రగుంట మల్లికా, శనక్కాయల సీతామాలక్ష్మి, రమాదేవి, బత్తుల భవాని, మేకల రవీంద్రబాబు, కదిరి సంజీవ్, నరసింహరావు, సోమి ఉదయ్, మధులాల్, శిఖ బాలు తదితరులు పాల్గొన్నారు.