ఆరోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్… అధికారులకు దిశానిర్దేశం

ఈటల రాజేందర్ ను ఆరోగ్య శాఖ నుంచి తప్పించిన నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ స్వయంగా చేపడుతున్నారు. దీనిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం కూడా తెలిపారు. ఈ క్రమంలో, సీఎం కేసీఆర్ వెంటనే బాధ్యతలు అందుకుని, కరోనా పరిస్థితులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ప్రతిరోజు మూడు పర్యాయాలు సమీక్ష చేపట్టాలని, కరోనా పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఆక్సిజన్, బెడ్లు, రెమ్ డెసివిర్, ఇతర ఔషధాల లభ్యత విషయంలో ఏ మాత్రం లోపం రాకూడదని అన్నారు. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని అటు సీఎంఓ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థంగా పనిచేయాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.