సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ ఔట్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ శనివారం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ ను తప్పించింది. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మిగతా మ్యాచ్‌లకు కేన్‌ విలియమ్సన్‌ కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు లేఖలో పేర్కొంది. హైదరాబాద్‌ తన తర్వాతి మ్యాచ్‌లో మే 2వ తేదీన అరుణ్‌జైట్లీ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. రాజస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో పాటు లీగ్‌లో మిగతా మ్యాచ్‌లకు విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ట్విటర్‌లో తెలిపింది.

తదుపరి మ్యాచ్‌ల్లో ఓవర్‌సీస్‌ ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకునే విషయంలో కొన్ని మార్పులు చేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంఛైజీ లేఖలో వెల్లడించింది. గత కొన్నేండ్లుగా వార్నర్‌ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక ముందు కూడా తాను జట్టు గెలుపు కోసం కృషి చేస్తాడని ఆశిస్తున్నట్లు వివరించింది.

సీజన్‌ ఆరంభం నుంచి ఆ జట్టు సమిష్టిగా రాణించడంలో విఫలమైంది. పేలవ ప్రదర్శనతో ఐపీఎల్‌ 2021 పాయింట్ల పట్టికలో రైజర్స్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించిన హైదరాబాద్‌ చివరి స్థానంలో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలోనే ఫ్రాంఛైజీ జట్టు నాయకత్వ బాధ్యతలను విలియమ్సన్‌కు అప్పగించింది. బాల్‌ట్యాంపరింగ్‌ నిషేధం కారణంగా 2019 సీజన్‌లో సన్‌రైజర్స్‌ జట్టుకు విలియమ్సన్‌ నాయకత్వం వహించాడు. కేన్‌ కెప్టెన్సీలో ఆ ఏడాది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. 2016లో వార్నర్‌ సారథ్యంలోనే హైదరాబాద్‌ తొలిసారి టైటిల్‌ నెగ్గింది.