కోనసీమ కార్చిచ్చు వైసీపీ కుట్రలో భాగమే..!: గాదె వెంకటేశ్వరరావు

ప్రశాంతంగా పచ్చదనంతో అలరారే కోనసీమలో జిల్లాల పేరుతో కార్చిచ్చు రగిల్చి.. అందులో రాజకీయ చలికాచుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని, కోనసీమలో జరిగిన విద్వ0సం వైసీపీ కుట్రలో భాగమేనని జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురంలో జరిగిన అల్లర్లలో జనసేనకు ప్రమేయం ఉందంటూ.. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో చెలరేగిపోతున్న అరాచకాశక్తులను నియంత్రించడంలోనూ.. శాంతిభద్రతలను కాపాడటంలోనూ పూర్తిగా వైఫల్యం చెందిన వైసీపీ నేతలు తమ అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు జనసేనపై బురద చల్లాలని చూడటం సిగ్గుచేటన్నారు. జిల్లాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టడాన్ని జనసేన పూర్తిగా సమర్దిస్తుందన్నారు. అన్ని జిల్లాలతో పాటూ కోనసీమకు కూడా ఆనాడే పేరు పెట్టి ఉంటే ఈ గొడవలు ఉండేవి కావని, కోనసీమ జిల్లాకు ప్రత్యేక విధానం ప్రకటించడంలోనే పెద్ద కుట్ర దాగుందన్న విషయం అల్లర్లతో తేటతెల్లం అయిందన్నారు. వైసీపీ నేతలకు నిజంగా అంబేద్కర్ పై ప్రేమ ఉంటే ఒక పధకానికన్నా ఆయన పేరు పెట్టేవారని, దళితులపై వైసీపీది కపట ప్రేమన్నారు. తాము గెలిపించిన వైసీపీ ప్రభుత్వంలో తమకు ఆదరణ లేక దళితులు అన్యాయాలకి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవలంభిస్తున్న దళిత వ్యతిరేక విధానాలతో వైసీపీకి పూర్తిగా దళితులు దూరమయ్యారన్న నిఘా వర్గాల సమాచారంతో వారిని దగ్గర చేసుకునే ప్రయత్నంలోనే జిల్లాల చిచ్చు రగిల్చారన్నారు. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒక దళితున్ని చంపేసినా.. దళిత అడబిడ్డలు అత్యాచారాలకు గురైనా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన హోంమంత్రి కోనసీమ అల్లర్లను జనసేనకు ముడిపెట్టడం ఆకాశంపై ఉమ్మి వేయటంలాంటిదన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ మాట్లాడుతూ.. కులాలను కలుపుతూ, మతాలను గౌరవించాలన్న సిద్దాంతాల పునాదిపై ఏర్పడిన పార్టీ జనసేన అని.. అణగారిన వర్గాలకు, దళితులకు జనసేన అధికప్రాధాన్యం ఇస్తుందన్నారు. దామోదరం సంజీవయ్య, బీ ఆర్ అంబేడ్కర్ లాంటి మహానుభావుల ఆశయసాధనకు నిరంతరం జనసేన కృషి చేస్తుందన్నారు. కోనసీమ ప్రజలు ఎంతో మంచివారని.. కల్లాకపటం లేని.. కల్మషం తెలియని తెలియనివారని.. వారు అల్లర్లకు పాల్పడేవారు కాదని.. బయటినుంచి కుట్రపూరితంగా వచ్చిన వారే ఈ అల్లర్లకు పాల్పడిఉంటారన్నారు. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా పెట్టుకొని గతంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ని తగలబెట్టిన వారే ఇప్పుడు ఇంతటి విద్వ0సానికి కారకులన్నారు. ముఖ్యమంత్రికి పరిపాలన పట్టదని.. మంత్రులకు తమ శాఖలపై అవగాహన లేదని.. సలహాదారులు అల్లర్లు సృష్టించి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే పనిలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదాకా ముఖ్యమంత్రికి నిద్రపట్టదని తీవ్రంగా విమర్శించారు. జరిగిన అల్లర్లకు ప్రతిపక్షాలపై నిందలు మోపటం ఆపి వెంటనే నిజనిర్దారణ కమిటీ వేయాలని.. అవసరం అయితే సీబీఐ విచారణ చేపట్టాలని కమాల్ అన్నారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో జనసేన విజయం సాధిస్తోందని కమాల్ అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, జిల్లా ఉపాధక్ష్యుడు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, నెల్లూరి రాజేష్, మధులాల్, తుమ్మల నరసింహారావు, మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.