ప్ర‌శ్న‌ప‌త్రాల లీక్‌… విద్యావ్య‌వ‌స్థ వీక్‌!

* ఆందోళ‌న‌లో 6.22 ల‌క్ష‌ల మంది ప‌దో త‌ర‌గ‌తి విద్యార్ధులు
* త‌ల్ల‌డిల్లుతున్న త‌ల్లిదండ్రులు
* వేళ్లూనిన నిర్ల‌క్ష్యం….కొర‌వ‌డిన నిఘా, నియంత్ర‌ణ‌
* చోద్యం చూస్తున్న జ‌గ‌న్ ప్రభుత్వం
* అడ్డ‌గోలుగా బుకాయిస్తున్న నేత‌లు, అధికారులు

“దేశంలోని ఎక్క‌డి వారైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌చ్చి డిగ్రీ చేయాల‌న్నంత బాగా విద్యావ్య‌వ‌స్థ‌ను న‌డిపించాలి…”
-ఇది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారుల‌కు చెబుతున్న సుద్దులు.
కానీ వాస్త‌వంలో జ‌రుగుతున్న‌ది వేరు…
ఉన్న‌త విద్య సంగ‌త‌లా ఉంచితే, ప్రాథ‌మికోన్న‌త విద్యా వ్య‌వ‌స్థ‌లోనే స‌రిదిద్దుకోలేనంత నిర్ల‌క్ష్యం, ఉదాసీనత వేళ్లూనుకుని పోయాయి!
అందుకు తాజా ఉదాహ‌ర‌ణే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో వ‌ర‌స‌గా ప్ర‌శ్న ప‌త్రాలు లీక్ అవుతున్న ప్ర‌హ‌స‌నం!
రెండేళ్ల త‌రువాత ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయంటే పాల‌నా యంత్రాంగం, అధికార గ‌ణం ఎంత అప్ర‌మ‌త్తంగా ఉండాలి?
కానీ ఆ అప్ర‌మ‌త్త‌త కానీ, నియంత్ర‌ణా విధానాలు కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఎక్క‌డా మ‌చ్చుకైనా లేవ‌న‌డానికి, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మొద‌లైన ప‌ది నిముషాల్లోనే ప్ర‌శ్న ప‌త్రాలు వాట్స‌ప్ మెసేజ్‌ల ద్వారా వ‌ర‌స‌గా స్వైర‌విహారం చేయ‌డ‌మే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం.
ముఖ్య‌మంత్రి చెప్పే మాట‌లు కేవ‌లం నీటి మూట‌ల‌న‌డానికి ఇంత‌కు మించిన తార్కాణం ఏదీ ఉండ‌దు.
మొన్న‌టికి మొన్న హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం…
నిన్న‌టికి నిన్న తెలుగు ప్ర‌శ్న‌ప‌త్రం…
ఆ త‌ర్వాత వ‌ర‌స‌గా మూడో రోజు ఇంగ్లిషు ప్రశ్న‌ప‌త్రం…
ప‌రీక్ష మొద‌లైన ప‌ది నిముషాల్లోనే వీటి ఫొటోలు సెల్‌ఫోన్ల‌లో వాట్స‌ప్ సందేశాల ద్వారా లీక్ అవుతుండ‌డం రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది త‌ల్లిదండ్రుల‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 6 ల‌క్ష‌ల 22 వేల మంది విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాస్తున్నారు. హైస్కూలు గ‌డ‌ప దాటి కాలేజీ మెట్లు ఎక్కే ద‌శ‌లో అత్యంత కీల‌క‌మైన ఈ ప‌రీక్ష‌ల ప‌ట్ల త‌ల్లిదండ్రులు ఎంత బాధ్య‌త‌తో, ఎంత శ్ర‌ద్ధాస‌క్తుల‌తో పిల్ల‌ల చేత చ‌దివిస్తారో ఎవ‌రికీ చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కానీ ఇంత ముఖ్య‌మైన ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ప‌ట్ల అత్యంత నిర్ల‌క్ష్యం పాల‌క‌, అధికార వ‌ర్గాల్లో పేరుకుపోవ‌డ‌మే ఇప్పుడు ఎవ‌రికీ మింగుడు ప‌డ‌డం లేదు.
ఓ ప‌క్క ప్ర‌శ్న‌ప‌త్రాలు కొంద‌రు వైకాపా నేత‌ల సెల్‌ఫోన్‌ల‌లో సైతం స్వైర విహారం చేస్తుంటే… “ఇదంతా కొంద‌రి కుట్ర, కుతంత్రాల వ‌ల్లే జ‌రుగుతోంది. ప్ర‌శ్న‌ప‌త్రాలు ఎక్క‌డా లీక్ కాలేదు” అంటూ బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అడ్డ‌గోలుగా బుకాయించ‌డం రాష్ట్రంలో విద్యార్థుల‌ను, త‌ల్లిదండ్రులనే కాదు… విద్యావేత్త‌ల‌ను సైతం విస్మ‌య ప‌రుస్తోంది. మంత్రిని అనుస‌రిస్తున్నట్టుగా అధికార యంత్రాంగం కూడా అదే పాట పాడుతూ ప్ర‌క‌ట‌ల‌ను చేయ‌డం రోత పుట్టిస్తోంది.
*క‌నీ వినీ ఎరుగ‌ని దృశ్యాలు…
ఎక్క‌డైనా ప‌రీక్ష‌లు చాలా స‌జావుగా, స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. అలా జ‌రిగేలా చూడ‌డం ప్ర‌భుత్వం బాధ్య‌త కూడా. కానీ కొన్ని రోజులుగా ఆంధ్ర‌ప్రదేశ్‌లో మాత్రం క‌నీ వినీ ఎరుగ‌ని దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. అందుకు ఇవిగో ఉదాహ‌ర‌ణ‌లు…
* ఓ ప‌రీక్ష కేంద్రంలో ప‌రీక్ష‌లు అయిపోయిన త‌ర్వాత కూడా పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు వ‌ద‌ల లేదు. బ‌య‌టకు లీక్ అయిన ప్ర‌శ్న‌ప‌త్రం ఫొటోలో ఉన్న చేతి మీద ఆషిక అనే పేరు ఉండ‌డంతో ఆ కేంద్రంలో ప‌రీక్ష రాసిన 274 మంది విద్యార్థుల‌ను వ‌ర‌స‌లో నిల‌బెట్టి అంద‌రి చేతులూ ప‌రిశీలించారు. ఇదంతా పూర్త‌వ‌డానికి కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. అలా ఎందుకు త‌నిఖీ చేస్తున్నారో పిల్ల‌ల‌కు తెలియ‌దు. ప‌రీక్ష స‌మ‌యం అయిపోయినా పిల్ల‌లు బ‌య‌ట‌కు ఎందుకు రాలేదో బ‌య‌ట వేచి ఉన్న త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌దు. ఆఖ‌రికి త‌ల్లిదండ్రులు నినాదాలు చేస్తూ ఆందోళ‌న కూడా చేయాల్సి వ‌చ్చింది. హేయ‌మైన ఈ సంఘ‌ట‌న‌ నంద్యాల జిల్లా నందికొట్కూరులో జ‌రిగింది.
* ఓ విద్యార్థి చిట్టీలు పెట్టి రాస్తుండ‌డంతో ఇన్విజిలేట‌ర్ ప‌ట్టుకున్నారు. ప‌రిశీలించి చూస్తే ఆ చిట్టీల‌న్నీ ఆ ప్ర‌శ్న ప‌త్రంలో ఉన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించిన‌వే. ‘ఇవే ప్ర‌శ్న‌లకు ఎలా చిట్టీలు పెట్టావ‌ని ప్ర‌శ్నిస్తే’… ‘యూట్యూబ్‌లో ఒక రోజు ముందే కొశ్చ‌న్ పేప‌ర్లు వ‌చ్చేస్తున్నాయి క‌దా సార్‌?’ అని ఆ విద్యార్థి చెప్పాడు. ఆశ్చ‌ర్యానికి గురిచేసే ఈ సంఘ‌ట‌న‌ క‌డ‌ప జిల్లాలోని ఓ ప‌రీక్ష కేంద్రంలో జ‌రిగింది.
* ప‌రీక్ష కేంద్రంలో ప‌రీక్ష మొదల‌వ‌గానే బ‌య‌ట నుంచి ఓ యువ‌కుడు ప్ర‌హారీ గోడ దూకి లోప‌లికి వెళ్లి కిటికీ ద్వారా ప్ర‌శ్న‌ప‌త్రం బ‌య‌ట‌కు ర‌ప్పించి, దాన్ని సెల్‌ఫోన్‌తో ఫొటో తీసి ద‌ర్జాగా బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత నిమిషాల్లోనే ఆ ఫొటో వంద‌లాది మందికి బట్వాడా అయిపోయింది. చిత్తూరు జిల్లా తిరుమ‌ల ప‌ల్లెలోని ఓ ప‌రీక్ష కేంద్రంలో జ‌రిగిందిది.
* ఓ ప‌రీక్ష కేంద్రంలో గుమాస్తా ఒక విద్యార్థి చేతిలోని ప్ర‌శ్న‌ప‌త్రం తీసుకుని దాన్ని సెల్‌ఫోన్‌తో ఫొటో తీసి ఒక టీచ‌ర్‌కి పంపించాడు. ఆ టీచ‌ర్ తొమ్మిది మంది టీచ‌ర్ల‌కు పంపించాడు. వాళ్లంతా ఆ ప్ర‌శ్న‌ప‌త్రంలోని ప్ర‌శ్నల‌కు జ‌వాబులు రాసి వాటిని గ‌దుల్లో రాస్తున్న విద్యార్థుల‌కు అందించే ప్ర‌య‌త్నం చేశారు. అంటే మాస్ కాపీయింగ్ అన్న‌మాట‌. నివ్వెర ప‌రిచే ఈ సంఘ‌ట‌న నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల ప‌రీక్ష కేంద్రంలో జ‌రిగింది.
* ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు ఓ ప‌రీక్షా కేంద్రంలోకి వెళ్లి అక్క‌డ ఇన్విజిలేట‌ర్‌గా ఉన్న మ‌రో ఉపాధ్యాయుడి స‌హ‌కారంతో ప్ర‌శ్న‌ప‌త్రాన్ని ఫొటో తీసి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఆ ఫోటోను ఓ ప్రైవేటు స్కూలు య‌జ‌మానికి పంపాడు. ఆయ‌న మ‌రో ప్రైవేట్ స్కూలు డీన్‌కు పంపాడు. ఆయ‌న నుంచి మ‌రో స్కూలు వైస్ ప్రిన్సిపాల్‌కు, ఇంకో స్కూలు ప్రిన్సిపాల్‌కు చేరిపోయింది. విద్యావంతుల‌ను ఆవేద‌న‌కు గురి చేసే ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా నెల్లేప‌ల్లె ప‌రీక్ష కేంద్రంలో జ‌రిగింది. ఈ కేసులో ఇద్ద‌రు ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌తో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు.
-ఇలా ఒక‌టి కాదు, రెండు కాదు… ఎన్నో సంఘ‌ట‌న‌లు రాష్ట్రంలో విద్యావ్య‌వ‌స్థ పూర్తిగా గాడి తప్పింద‌న‌డానికి నిద‌ర్శ‌నాలుగా నిలుస్తున్నాయి. ఇవ‌న్నీ క‌ష్ట‌ప‌డి చ‌దివే ల‌క్ష‌లాది విద్యార్థులు, వాళ్ల భ‌విష్య‌త్తుపై ఆశ‌ల పెంచుకునే ల‌క్ష‌లాది మంది త‌ల్లిదండ్రుల‌కు మాన‌సిక క్షోభ‌ను క‌లిగించేవేన‌న‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు.
*అడుగ‌డుగునా నిర్ల‌క్ష్య‌మే…
ల‌క్ష‌లాది మంది విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌తో ముడి ప‌డిన ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ప‌ట్ల ప్రభుత్వ నేత‌ల్లో కానీ, అధికార యంత్రాంగంలో కానీ ఎక్క‌డా బాధ్య‌తాయుత‌మైన నియంత్ర‌ణ లేద‌ని ప్ర‌శ్న ప‌త్రాల లీకేజి వ్య‌వ‌హారం నిరూపిస్తోంది. ఎందుకంటే… ప‌రీక్ష ప‌త్రాల‌ను పోలీస్ స్టేష‌న్ల‌లో భ‌ద్ర ప‌రుస్తారు. ప‌రీక్ష ఉదయం 9.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుందంటే కేవ‌లం ప‌దిహేను నిమిషాల ముందు కేంద్రానికి చేరేలా వాహ‌నాల‌ను ఏర్పాటు చేసుకుంటారు. పోలీస్ స్టేష‌న్ నుంచి కేంద్రాల‌కు త‌ర‌లించ‌డానికి ఓ సిట్టింగ్ స్క్వాడ్‌ను నియ‌మిస్తారు. కేంద్రానికి చేరుకున్న వెంట‌నే క‌ట్ట‌ల‌ను తెరిచి నేరుగా గ‌దుల్లో విద్యార్థుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తారు. ప్ర‌తి ప‌రీక్ష కేంద్రంలో ఓ చీఫ్ సూప‌రింటెండెంట్‌, డిపార్ట్మంట్ అధికారులు, ఇన్విజిలేట‌ర్లు ఉంటారు. అయితే ఈ ప్ర‌క్రియ అంతా తూతూ మంత్రంగా సాగుతోంద‌న‌డానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు అడుగ‌డుగునా క‌నిపిస్తున్నాయి. చాలా కేంద్రాల‌కు ఉద‌యం 9 గంట‌ల‌కే పేప‌ర్లు వ‌చ్చేస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌రీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు సెల్‌ఫోన్ల‌తో వెళ్లే ప్ర‌స‌క్తే ఉండ‌దు. కానీ ఇన్విజిలేట‌ర్లు, అధికారుల ద‌గ్గ‌ర సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. నిజానికి ఎవ్వ‌రి ద‌గ్గ‌రా సెల్‌ఫోన్‌లు ఉండ‌కుండా చూడ‌వ‌చ్చు. ఒక‌రిద్ద‌రు పోలీసుల స‌మ‌క్షంలో ఉన్న‌తాధికారి ఎదురుగా ప్ర‌శ్న‌ప‌త్రాలు తెర‌చి ఇన్విజిలేటర్ల ద్వారా గదుల్లోకి వెళ్లేలా చేస్తే ఎలాంటి స‌మ‌స్య ఉత్ప‌న్నం కాదు. కానీ ఇలాంటి ప‌క‌డ్బందీ నియంత్ర‌ణ కానీ, నిర్వ‌హణ ప‌ద్ధుతులు కానీ చాలా కేంద్రాల్లో మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. పై నుంచి కింది వ‌ర‌కు ఇలా నిర్ల‌క్ష్యం వేళ్లూనుకుని పోవ‌డ‌మే ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజికి దారి తీసింది. పైగా మొద‌టి రోజు లీకేజి జ‌రిగింద‌న‌గానే వెంట‌నే అధికార నేత‌లు, యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైతే ఇలా వ‌ర‌స లీకేజిలు జ‌రిగే అవ‌కాశ‌మే ఉండ‌దు. కానీ ఆ దిశ‌గా ప్రయ‌త్నాలేవీ చేయ‌కుండా అడ్డ‌గోలుగా బుకాయించ‌డం, ఎలాంటి లీకేజీ లేద‌ని ప్ర‌క‌ట‌న‌లు జారీ చేయ‌డం… ప్ర‌త్య‌ర్థుల కుట్ర‌గా అభివ‌ర్ణించ‌డం ఇదంతా బాధ్య‌తా రాహిత్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నమనే విమ‌ర్శ‌లు సామాన్యుల నుండి కూడా వెల్లువెత్తుతున్నాయి.
*అస‌లు కార‌ణాలివేనా?
రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది విద్యార్థులు సీబీఎస్ఈ సిల‌బ‌స్‌తో రెండో సెమిస్ట‌ర్ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాస్తున్నారు. ఈ ప‌రీక్ష‌లు అన్నీ ప్రైవేటు పాఠ‌శాల‌ల య‌జ‌మానుల అజ‌మాయిషీలోనే జ‌రుగుతున్నాయి. అవ‌న్నీ స‌క్ర‌మంగానే జ‌రుగుతున్నాయి. అలాంటిది ఎంతో మందీ మార్బ‌లం, అధికార యంత్రాంగం ఉన్న ప్ర‌భుత్వ అజ‌మాయిషీలో స్టేట్ సిల‌బ‌స్‌తో జ‌రిగే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల విష‌యంలోనే ఇన్ని అవ‌క‌త‌వ‌క‌లు, లోపాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అందుకు కార‌ణం ఒక్క‌టే… ప్ర‌భుత్వ ప‌ర‌మైన బాధ్య‌తా రాహిత్యం!
మాట‌లు త‌ప్ప చేత‌లు కాన‌రాని జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నిర్వీర్య‌మై పోయాయ‌న‌డానికి ఇదొక తాజా తార్కాణం. ప్ర‌భుత్వ పాఠశాల‌ల్లో ఉత్తీర్ణ‌త శాతాన్ని పెంచ‌డానికి క‌లెక్ట‌ర్లు టార్గెట్లు నిర్ణ‌యించారు. నిజానికి ఇది మంచి విష‌య‌మే కానీ, అందుకు త‌గిన సూచ‌న‌లు చేస్తూ మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌క పోవ‌డంతో పాటు, స‌క్ర‌మ‌మైన అజ‌మాయిషీ లోపించ‌డంతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ఉపాధ్యాయులు త‌మ జిల్లా ముందంజ‌లో ఉండాల‌నే అత్యుత్సాహంతో మాస్ కాపీయింగ్‌కి, ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజికి కార‌కుల‌వుతున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఒక వేళ వెన‌క‌బ‌డితే త‌మ పైన చ‌ర్య‌లు ఉంటాయేమోన‌నే భ‌యం కూడా చాలా మంది ఉపాధ్యాయుల్లో క‌ల‌గ‌డం కూడా ఇందుకు దోహ‌దం చేసింద‌నే వాద‌న‌లు ఉన్నాయి. మొత్తానికి ఏది ఏమైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ల‌క్ష‌లాది మంది విద్యార్థులు, త‌ల్లిదండ్రులు తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నార‌న‌డంలో సందేహం ఏదీ లేదు.
ఈ నేప‌థ్యంలో… “దేశంలో ఎక్క‌డి వారైనా చ‌దువుకోడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి రావ‌డం కాదు…
రాష్ట్రంలోని విద్యార్థులు ఇక్క‌డ త‌ప్ప దేశంలో ఎక్క‌డ చ‌దువుకున్నా న‌య‌మే అనే స్థితికి రాకుండా చూసుకోవ‌ల‌సిన బాధ్య‌త” ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద ఉంది. కానీ మాట‌లు కోట‌లు దాటినా, చేత‌లు గ‌డ‌ప దాట‌వ‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ బాధ్య‌త‌ను గుర్తిస్తుందో లేదోన‌నేది అనుమాన‌మే!