కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి

  • చెరువుల కబ్జాలు తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
  • కబ్జాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులను, సిబ్బందిని సస్పెండ్ చేయాలి
  • చెరువుల్లో నిర్మాణాలకు పట్టాలు ఇచ్చిన వారిపై చర్యలు చేపట్టాలి
  • అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరిన ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు,జనసేన పార్టీ నాయకులు వంగల దాలినాయుడు

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణంతో పాటు జిల్లాలో జరుగుతున్న చెరువుల కబ్జాలు తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు కోరారు. శనివారం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రఘు సత్య సింహ చక్రవర్తి, పార్వతీపురం మండల అధ్యక్షులు బలగ శంకరరావు, ఉపాధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు అన్నాబత్తుల దుర్గాప్రసాద్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ చెరువులు, గెడ్డలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయన్నారు. అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జాలు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ఈ విషయమై పలుమార్లు ఆయకట్టు రైతులతో పాటు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. పార్వతీపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నెల్లిచెరువు, లక్ష్మనాయుడు చెరువు, దేవుడి బంధ, లంకెల చెరువు, కోదువానిబంధ, కొత్తచెరువు, సంఘం నాయుడు చెరువు, వరహాల గెడ్డ తదితర నీటి వనరులను కబ్జాదారులు కబ్జా చేస్తూ దర్జాగా పక్క భవనాలు నిర్మిస్తున్నారన్నారు. కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతో చెరువుల్లో స్థలాల అమ్మకాలకు బోగస్ పట్టాలను లక్షల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారన్నారు. ఇదంతా సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, మున్సిపాలిటీ సచివాలయ అధికారులు సిబ్బంది కళ్ళముందే జరుగుతున్నప్పటికీ చర్యలు శూన్యం అన్నారు. ఇప్పటికే ఆయా చెరువులు కబ్జాదారుల చేతుల్లో చిక్కి శల్యమయ్యాయన్నారు. ఇదే పంథా కొనసాగితే కొన్ని రోజులకు చెరువులు కనిపించని ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా నూతన జిల్లా ఏర్పడి నప్పటి నుండి పార్వతీపురం పట్టణంతో పాటు జిల్లాలో కబ్జాలు చెరువుల కబ్జాలు అధికమయ్యాయన్నారు. అయినప్పటికీ వాటిని నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందన్నారు. కాబట్టి స్వతహాగా జిల్లా కలెక్టర్ ఆయా చెరువుల ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి, చెరువులు కబ్జాలను గుర్తించి, దీనికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కబ్జాలకు అండదండల అందిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించని సంబంధిత శాఖ అధికారులను, సిబ్బందిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జిల్లాస్థాయి అధికారులు కబ్జాదారుల చెప్పు చేతల్లో నడవడం, అధికార పలుకు బడికి తలొగ్గటం తదితరవి మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా చర్యలు చేపట్టని పక్షంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తదుపరి చర్యలకు పూనుకొంటుందని హెచ్చరించారు.