ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్‌ ఇచ్చిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌

కరోనా కారణంగా సెప్టెంబర్‌లో జరగాల్సిన జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆయా పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌కు ఫైల్‌ పంపారు. అయితే ఆ ఫైల్‌ను అనిల్‌ తిరస్కరించారు. ఆ పరీక్షలను నిర్వహించేందుకు ముందుకు సాగాలని చెప్పారు. దీంతో సీఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది.

ఢిల్లీలో నిర్వహించిన ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ మీటింగ్‌లో సీఎం కేజ్రీవాల్‌ ఆ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. జేఈఈ, నీట్‌ పరీక్షలను ఎట్టి పరిస్థితిలోనూ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని, విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని ఢిల్లీ ప్రభుత్వం కోరినా అనిల్‌ బైజల్‌ వినలేదు.

కాగా ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ పరీక్షల నేపథ్యంలో స్పందిస్తూ.. ఢిల్లీలో ఆయా పరీక్షలను రాసే విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. పూర్వ విద్యార్థులు ఆ విద్యార్థులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో వచ్చేలా చూడాలని అన్నారు. కాగా దేశంలో బీజేపీయేతర పార్టీలు పాలించే పలు రాష్ట్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించకూడదని, వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాలు వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఏమంటుందో చూడాలి.