తెలంగాణలో పరిమిత సంఖ్యలో పోటీ

* 7 నుంచి 14 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగుతాం
* జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లాగా పక్కకు తప్పుకొనేది లేదు
* తెలంగాణ రవాణా శాఖ వారాహికి రిజిస్ట్రేషన్ చేస్తే… ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటామంటోంది
* నాచుపల్లిలో మీడియాతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్లమెంట్ స్థానంతోపాటు 7 నుంచి 14 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఎక్కెడెక్కడ పోటీ చేస్తున్నది అతి త్వరలో తెలియజేస్తామన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలకు రాబోయే 25 ఏళ్లు చాలా కీలకమైనవని, కొత్త తరానికి అవకాశం ఇచ్చే పార్టీగా జనసేన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రవాణా శాఖ అధికారులు రూల్ బుక్ ప్రకారం వారాహికి రిజిస్ట్రేషన్ చేస్తే… వైసీపీ నాయకులు మాత్రం రాజకీయ కోణంలో ఆలోచిస్తూ వారాహిని అడ్డుకుంటామని మాట్లాడం సిగ్గుచేటని అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా నాచుపల్లి శివార్లలోని బృందావన్ రిసార్టులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ఐదేళ్ల క్రితం కొండగట్టుకి వచ్చి అంజన్న ఆశీస్సులు తీసుకున్నాను. ఇప్పుడు జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను. ఏ ముఖ్య కార్యక్రమం ప్రారంభించినా కొండగట్టు ఆలయంలో పూజలు చేసిన తర్వాతే ప్రారంభిస్తాను. ప్రాణగండం ఉందని చెప్పినా వినకుండా 2009లో ఎన్నికల ప్రచారానికి వచ్చాను. ప్రచారంలో పాల్గొన్నప్పుడు హై వోల్టేజ్ విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. జుట్టు కొంతభాగం కాలిపోయింది కానీ ప్రాణహాని జరగలేదు. అప్పటి నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి అంటే అపరిమితమైన నమ్మకం. నాకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడు. 2009 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తిరిగాను. ఇక్కడి ప్రజల కష్టనష్టాలు బాగా తెలుసు. ఈ ప్రాంత నాయకుల కోరిక మేరకు పరిమితమైన స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రాంత సమస్యలపై ఇంకా లోతుగా అవగాహన తెచ్చుకోవాలి. పోలీస్ నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దేహ దారుడ్య కొలతలను మార్చినట్లు కొంతమంది యువత నా దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు మళ్లీ కొత్త కొలతలకు తగ్గట్టు సన్నద్దత కావడం కష్టమవుతుందని యువత ఆవేదనలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం పాత పద్దతిని అనుసరించి నియామకాలు చేపట్టాలని కోరుతున్నాను. బీజేపీ జాతీయ నాయకులు రిక్వెస్ట్ చేయడంతో ఆనాడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నాం. ఇప్పుడు కూడా నా మద్దతు బీజేపీకి ఉన్నా ఈసారి మాత్రం జనసేన పార్టీ తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తుంది. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉంద”న్నారు.