కౌలు రైతుల కన్నీటి వెతలు ఆలకిస్తూ.. Dec 18 2022

•వారి కుటుంబాల్లో భరోసా నింపిన పవన్ కళ్యాణ్
•210 మందికి రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం
•ఉమ్మడి గుంటూరు జిల్లాలో కౌలు రైతు భరోసా సభ
•జనసేనానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం
•పూల వర్షం కురిపించిన గుంటూరు జిల్లావాసులు
•దారిపొడుగునా హారతులు పట్టిన వీర మహిళలు
•గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు గజమాలలతో ముంచెత్తిన జనసేన శ్రేణులు
•కేవీపీ కాలనీ వద్ద రెల్లి కులస్తుల గజమాల అలంకారం
•అధికార పార్టీ బెదిరింపులు, పోలీసు ఆంక్షల మధ్య భారీగా తరలి వచ్చిన ప్రజలు

ఇంటి పెద్దను కోల్పోయి.. ప్రభుత్వం నుంచి ఆసరా కరవైన కుటుంబాలు.. కన్నీటి సుడుల్ని దిగమింగుతూ బిడ్డల భవిష్యత్తుపై బెంగతో కాలం వెళ్లదీస్తున్న కుటుంబాలు.. ఏటా వ్యవసాయం అప్పులు మిగల్చగా.. పాలకుల నుంచి భరోసా లేని పరిస్థితుల్లో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలు.. సత్తెనపల్లిలో నిర్వహించిన జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రకు తరలివచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆర్ధిక సాయం అందుకున్నారు. అధికార పార్టీ బెదిరింపులు – పోలీసు ఆంక్షల్ని పక్కనపెట్టి సుమారు 210 కుటుంబాలు సత్తెనపల్లి సభకు రాగా, ప్రతి కుటుంబానికి స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. లక్ష చొప్పున చెక్కులు అందచేశారు. కౌలు రైతుల కన్నీటి వెతలు తెలుసుకుంటూ.. కుటుంబ పెద్ద దూరమయ్యాక వారు పడిన ఇబ్బందులు అడిగి తెలుసుకుని ప్రతి కుటుంబాన్ని ఓదార్చారు. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా నింపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కౌలు రైతు భరోసా యాత్రకు తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ.. పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
•ఏటుకూరులో పూల వర్షం
అంతకు ముందు సత్తెనపల్లిలో నిర్వహించిన కౌలు రైతు భరోసా యాత్ర కోసం మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన శ్రేణులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గుంటూరు శివారు ఏటుకూరు వద్ద వందలాది జనసైనికులు పూలవర్షం కురిపించారు. గజమాలతో సత్కరించారు. వీర మహిళలు హారతులు పట్టి జిల్లా పర్యటనకు ఆహ్వానించారు. తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు.
•కేవీపీ కాలనీ వద్ద రెల్లి కులస్తుల గజమాల
గుంటూరు కేవీపీ కాలనీ వద్ద రెల్లి కులస్థులు పవన్ కళ్యాణ్ గారికి మరో గజమాల వేశారు. రెల్లి కులాన్ని గౌరవించే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారు గుండెల్లో పెట్టుకుని చూస్తారు. కేవీపీ కాలనీ వద్ద వారు ప్రత్యేకంగా చేయించిన గజమాలతో జనసేనానిని సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
•ఏటుకూరు టూ సత్తెనపల్లి భారీ ర్యాలీ
ఏటుకూరు నుంచి కేవీపీ కాలనీ, పేరేచర్ల, మేడికొండూరు, కోర్రపాడు మీదుగా పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి సభ వద్దకు చేరుకున్నారు. అడుగడుగునా ఘనస్వాగతం పలికిన జనసేన శ్రేణులు బైకులు, కార్లతో ర్యాలీగా ఆయన్ని అనుసరించారు. పేరేచర్ల, మేడికొండూరు, సత్తెనపల్లి క్లాక్ టవర్ సెంటర్లలో మరికొన్ని గజమాలలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అలంకరించాయి. దారి పొడుగునా మహిళలు, ప్రజలు పవన్ కళ్యాణ్ రాకకోసం రహదారికి ఇరువైపులా నిలబడి జేజేలు పలికారు. జనసేనాని రాకతో సత్తెనపల్లి పట్టణం పూర్తిగా కిక్కిరిసింది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలపై నుంచి కూడా మహిళలు పవన్ కళ్యాణ్ మీద పూల జల్లులు కురిపించారు.
•కౌలు రైతు కుటుంబాల పూల వర్షం
సభా ప్రాంగణానికి సమీపంలో ఆత్మహత్యకు పాల్పడి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్ధిక సాయం స్వీకరించేందుకు వచ్చిన కౌలు రైతు కుటుంబాల వారు కొంత మంది రహదారి మీద నిలబడి ఆయన్ను పూలతో నింపేశారు. పవన్ కళ్యాణ్ గారిని అనుసరించిన ప్రతి వాహనానికి పూలు జల్లి ఆనందోత్సాహాలను తెలిపారు.