ప్రజాసమస్యలపై పాలకుల మేలుకొలుపే ధ్యేయం

*భీమవరంలో జనవాణి – జనసేన భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్
*ముందుగా అల్లూరి విగ్రహానికి నివాళి

ప్రజా సమస్యల మూలల్లోకి వెళ్లి వాటికొక పరిష్కార మార్గం చూపించి పాలకులను నిద్రలేపేందుకే జనసేన పార్టీ ఆధ్వర్యంలో “జనవాణి – జనసేన భరోసా” కార్యక్రమం మొదలైందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం భీమవరంలోని ఆనంద ఇన్ కళ్యాణ మండపంలో జనవాణి – జనసేన భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ గత ఎన్నికల సమయంలో భీమవరం డంపింగ్ యార్డు సమస్య నా దృష్టికి వచ్చింది. దానిపై అప్పట్లోనే క్షేత్రస్థాయి పర్యటన చేసి, సమస్యను పరిశీలించాను. సమస్యను పాలకుల దృష్టికి తీసుకువెళ్లాం. అప్పట్లో హడావుడి చేసిన పాలకులు తర్వాత దానిని పూర్తిగా మర్చిపోయారు. తరువాత వచ్చిన ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు, అంటు వ్యాధులకు కారణం అవుతున్న డంపింగ్ యార్డు సమస్య అలాగే ఉండిపోయింది. దాని పక్కనే ఉంటున్న పేదల బతుకుల వెతలు మాత్రం మారలేదు. ఇలాంటి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ఒక వారధిగా జనవాణి కార్యక్రమం ఉపయోగపడాలి అనేది నా లక్ష్యం. ఎప్పటికప్పుడు ఈ సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి, జనసేన పార్టీ నాయకులు శ్రీ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో బృందం నిరంతరం పనిచేస్తుంది. ప్రజా సమస్యలపై జనసేన పార్టీ అలుపెరగకుండా పనిచేస్తుంది అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
*మన్యం వీరుడికి మనస్సుమాంజలి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇటీవల ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కృతమైన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం కోసం భీమవరం వచ్చిన ఆయన తొలుత అల్లూరి విగ్రహం వద్ద పూలమాల ఉంచి విప్లవ వందనాలు అర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక, విజ్ఞాన కేంద్రం నాయకులు గాదిరాజు సుబ్బరాజు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్షత్రియ సేవాపరిషత్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారికి శాలువా కప్పి, అల్లూరి జ్ఞాపికను అందజేశారు.