స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సమాయత్తం కావాలి

* మహిళలకు, యువతకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ 
* పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ పి.ఎ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్ 

‘రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన ఉప ఎన్నికలు రాబోతున్నాయి… ఈ ఉప ఎన్నికలకు పార్టీ నాయకులూ, శ్రేణులు సమాయత్తం కావాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ పి.ఎ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జులు, పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 107 ఎంపీటీసీలు, ఆరు జడ్పీటీసీ, 62 సర్పంచ్, 915 వార్డులకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో మన పార్టీ అభ్యర్థులను పోటీకి నిలిపి చిత్తశుద్ధితో పోరాడాలి. పార్టీపై అభిమానం, పార్టీ సిద్దాంతాలపై విశ్వాసం, బలంగా పోరాడే ధైర్యం ఉన్నవారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలి. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా మహిళలు, యువతకు ప్రాధ్యాన్యం ఇవ్వాలని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాలి. అదే విధంగా ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను కూడా ప్రకటన చేస్తారు. దీన్ని మన నాయకులూ పరిశీలించాలి. ఈ ఉప ఎన్నికలకు అవసరమైన సలహాలు, సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం అందిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో అధికార పక్షం చేసిన దౌర్జన్యాలను దృష్టిలో ఉంచుకొని మన పార్టీ నాయకులూ, శ్రేణులు ధైర్యంగా, వ్యూహాత్మకంగా పోరాడాలి. న్యాయపరమైన సహాయం ఎప్పుడూ అందిస్తామ”న్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం, పార్టీ లీగల్ సెల్ చైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ పాల్గొన్నారు.