వారాహి యాత్రను విజయవంతం చేయండి: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: రాష్ట్రంలో అరాచక, అక్రమ, అవినీతి, నిర్బంధాల రాక్షస పాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ప్రజా సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి విజయాత్రను విజయవంతం చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. చెన్నై టూర్ లో ఉన్న రెడ్డి అప్పలనాయుడు వీడియో ద్వారా మీడియాకు సందేశం పంపించారు. అక్టోబర్ 1వ తేదీన ఉమ్మడి కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి విజయాత్ర ప్రారంభం అవుతుందని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ వారాహి విజయాత్ర అవనిగడ్డ నుంచి ప్రారంభమై పెడను, మచిలీపట్నం, కైకలూరు మీదుగా కొనసాగుతుందని చెప్పారు. జగన్ రెడ్డి కొనసాగిస్తున్న అరాచక పాలనపై పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మేధావులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, యువత, అన్ని వర్గాల ప్రజలందరూ మద్దతు పలకాలని సూచించారు. రాష్ట్రంలో పరిపాలన లేదని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయిందని, శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన జేబులో పెట్టుకుని ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను, శాంతిభద్రతలను జగన్ రెడ్డి గాలికి వదిలేసారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో బాలిక అదృశ్యమైన సంఘటనపై వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. చివరకు ఆ బాలిక శవమై తేలిందని వారి కుటుంబ సభ్యులకు తీరని క్షోభ మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక హత్యపై చిత్తూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ, చివరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా పెదవి విప్పలేదన్నారు. రాష్ట్ర హోం మంత్రిగా ఒక మహిళ ఉన్నప్పటికీ మహిళలు, బాలికలపై నిరంతరం హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు. వీటిని అరికట్టకుండా చోద్యం చూస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు దుయ్యబట్టారు. అయితే ప్రతిపక్ష నాయకులను, ప్రజాసంఘాల గొంతికలు నొక్కి, తప్పుడు కేసులు పెట్టి జైల్లో నెట్టేందుకు పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం వాడుకుంటుందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ప్రజలు ఆందోళనలు చేస్తుంటే తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హైదరాబాదును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా తెలంగాణను ఆర్థికంగా అభివృద్ధి చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలంగాణలో ఐటి ఉద్యోగులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతు ఎత్తి చాటే హక్కు ప్రతి ప్రాంతానికి, ప్రతి పౌరుడికి ఉందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు తెలంగాణలో కాదని ఆంధ్రప్రదేశ్లో చేసుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యలను రెడ్డి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆస్తుల పంపకానికి సంబంధించి తెలంగాణలో ఉన్న వందల కోట్ల రూపాయల ఆస్తులను జగన్ రెడ్డి కెసిఆర్ ప్రభుత్వానికి అప్పనంగా కట్టబెట్టి ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేశారన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తుంటే ఆయనతో జగన్ కు ఉన్న రాజకీయ ఒప్పందం బయటపడిందన్నారు. సీఎం జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులా మారాడని, విధ్వంసాలకు పాల్పడుతూ ప్రశ్నించే వారిని జైల్లో పెడుతూ రాక్షస ఆనందం పొందుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఆరు నెలల్లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి చమర గీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని హెచ్చరించారు.