గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌లో వ్యక్తి హత్య, సీసీ టీవీల్లో రికార్డయిన మర్డర్ సీన్స్

హైదరాబాద్ చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్ లో దారుణ హత్య జరిగింది. గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్ లో నిన్న రాత్రి ఇద్దరు దొంగల మధ్య వివాదం చోటు చేసుకోగా అందులో ఒక దొంగ మరో దొంగ గొంతు కోసి హత మార్చాడు. నిన్న రాత్రి 12.గంటల సమయంలో గొడవ పడిన దొంగలు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. రాజు అనే వ్యక్తి తనని చంపుతాను అని బెదిరిస్తున్నాడని ఫిరోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజుని పిలిపించి మందలించి వదిలి వేశారు పోలీసులు.

అయితే తనను ఎక్కడ చంపుతాడో అనే భయంతో 3.15 గంటలకు రాజుని ఫిరోజ్ గొంతు కోసి చంపాడు. మల్లాపూర్ కు చెందిన రాజు గత నెలలో పండ్ల దొంగతనం కేసులో చైతన్య పురి పోలీసు స్టేషన్ లో అరెస్టై , బెయిల్ పై విడుదల అయ్యాడు. ఫ్రూట్ మార్కెట్ లలో తరచు పండ్లను దొంగిలించే వాడని , అదే క్రమంలో బాగా మద్యం సేవించి , నిన్న రాత్రి కుడా ఫ్రూట్ మార్కెట్ లో పనిచేసే మరో కూలి మహ్మద్ ఫిరోజ్ తో గొడవ పడి , నన్నే అరెస్టు చేపిస్తావా , నీ అంతు చూస్తానని రాజు బెదిరించినట్లు సమాచారం.

రాజు బెదిరింపులకు దిగడంతో నిన్న రాత్రి చైతన్య పురి పోలీసులకు ఫిరోజ్ ఫిర్యాదు చేశాడు. రాజు ఫిరోజ్ పై బెదిరింపులకు దిగడంతో నన్నే చంపుతావ అని కోపోద్రుక్తులైన మహ్మద్ ఫిరోజ్ ఈరోజు తెల్లవారు జామున సమయంలో గొంతుకోసి హత్య చేశాడని తెలుస్తోంది. ఈ మర్డర్ సీన్ అంతా సీసీ కెమెరాలో రికార్డయింది.  సీసీ కెమెరాలలో మాత్రం మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజును హత్య చేసిన మహ్మద్ ఫిరోజ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.