మనవి భవిష్యత్ ఆశలు… జగన్ రెడ్డివి బెదిరింపులు
* వచ్చే మార్చిలోనే ఎన్నికలు రావొచ్చు… అందరం సన్నద్ధం కావాలి
* ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు
* రైతులను ప్రభుత్వం నిలువునా మోసం చేసింది
* త్వరలోనే క్రియాశీల సభ్యులకు శిక్షణ తరగతులు
* తెనాలిలో క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమంలో శ్రీ నాదెండ్ల మనోహర్
‘వైసీపీ ప్రభుత్వాన్ని.. పాలనను ప్రజానీకమంతా వ్యతిరేకిస్తోంది.. సుమారు 73 శాతం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఎంతో సమయం లేదు… ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనసేన ప్రభుత్వం తీసుకురావడానికి క్రియాశీలక సభ్యులు పార్టీ కోసం ప్రతి రోజూ గంట నుంచి రెండు గంటల పాటు కష్టపడాలని సూచించారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు 50 మంది నుంచి వంద మందిని ప్రభావితం చేసేలా తయారు కావాలన్నారు. తెనాలి లో శుక్రవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ క్రియాశీలక సభ్యులను చేర్పించిన వాలంటీర్లను అభినందించి పార్టీ జెండాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ రోజురోజుకు బలపడుతోంది. దీనికి మన పార్టీలో చేరుతున్న క్రియాశీలక సభ్యుల సంఖ్య ఒక నిదర్శనం. 2019లో పార్టీ క్రియాశీలక సభ్యులను చేర్పించడానికి కేవలం 3253 మంది వాలంటీర్లు పని చేస్తే, ఇప్పుడు ఆ వాలంటీర్ల సంఖ్య 9700 కి చేరుకుంది. పార్టీ క్రియాశీలక సభ్యుల సంఖ్య 3.5 లక్షలకు చేరింది. జనసేన పార్టీ సభ్యత్వం నిజాయతీగా నిబద్ధతగా ఇస్తుంది. కొన్ని పార్టీలు చేపట్టే తూతూ మంత్రపు సభ్యత్వ నమోదు మన దగ్గర ఉండదు. కొన్ని పార్టీలు మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం తీసుకుంటాయి. మరికొన్ని పార్టీలు పది రూపాయలకు సభ్యత్వం ఇస్తాయి. ఇంకొన్ని పార్టీలు విచిత్రంగా ఓటర్ల జాబితాలోని పేర్లను నమోదు చేసి సభ్యత్వాలు ఇస్తాయి. జనసేన పార్టీ ఈ విషయంలో ఎలాంటి తప్పుడు మార్గాలను ఎంచుకోదు. సభ్యత్వ నమోదులో పూర్తిస్థాయి పారదర్శకత పాటిస్తున్నాం. 500 రూపాయలు ఇచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. శ్రీకాకుళం లాంటి జిల్లాలో కొందరు ఫోన్లు చేసి పింఛను వచ్చేంతవరకూ సభ్యత్వ గడువును పెంచాలని కోరడం పార్టీకి పెరుగుతున్న జనాదరణకు నిదర్శనం. ఇది జనంలో వస్తున్న మార్పు. వెయ్యికి పైగా సభ్యత్వాలను ఐదు మంది చేస్తే, 500 సభ్యత్వాలను 31 మంది పూర్తి చేశారు. 100 మందిని పార్టీలో చేర్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇది పార్టీపై ప్రజల్లో వస్తున్న నమ్మకం.
* క్రియాశీలక సభ్యులకు శిక్షణ
వచ్చే నెల నుంచి విడతలవారీగా క్రియాశీల సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు పూర్తి స్థాయి నాయకులుగా మారాలి. పార్టీ కోసం కష్ట పడాలి. అధికార పక్షం బెదిరింపులకు లొంగిపోవల్సిన అవసరం లేదు. తప్పుడు కేసులు పెడితే పెట్టమనండి. కచ్చితంగా జనసేన పార్టీ అండగా ఉంటుంది. మేమంతా మీ వెనుక ఉంటాం. అవసరం ఐతే రోడ్డు ఎక్కి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతీ క్రియాశీలక సభ్యుడు తన పరిధిలోని వారితో సఖ్యతగా ఉంటూ జనసేన సిద్ధాంతాలను, పార్టీ విధానాలను పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించండి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యం.
* మూర్ఖులతో వాదన వల్ల ఒరిగేదేమీ ఉండదు
సిద్ధాంతాలు, ప్రభుత్వ విధానాల మీద మాట్లాడండి. మూర్ఖులతో వాదన వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించొద్దు. గతంలో కొందరు జోకర్లను తీసుకువచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఎన్ని వ్యక్తిగత విమర్శలు దాడులు చేయించారో మనందరికీ తెలుసు. అలాంటి తప్పు మనం చేయనవసరం లేదు. నందివెలుగు నుంచి తెనాలి వరకు రోడ్డు అత్యంత అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు పనులకు ఎప్పుడో నిధులు కేటాయించినట్లు చెప్పారు. పనులు మాత్రం మొదలు కాలేదు. మనమంతా కలిసి శ్రమదానం ద్వారా రోడ్డు బాగు చేసుకుందాం. అప్పుడైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది. నియోజకవర్గ అభివృద్ధి, ఇతర ప్రభుత్వ విధానాల మీద మాట్లాడితే నాయకులకు సమాధానం చెబుదాం. అంతేకాని మూర్ఖులతో వాదించడం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు.
* సమాజానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు జనసేన తీసుకోదు
ప్రతి మతాన్ని గౌరవిస్తాం. అలాగే కులాలను కలుపుతాం. ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా, సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉంటే కచ్చితంగా ఆ నిర్ణయాన్ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తుంది. సైద్ధాంతిక బలం ఉన్న పార్టీ జనసేన. పార్టీకి సంబంధించిన ఏడు సిద్ధాంతాలను తప్పకుండా ఆచరిస్తాం. ఎంతటి వారైనా, ఏ పార్టీ అయినా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే కచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం అనడంలో సందేహం లేదు.
* సమయం లేదు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పెద్ద సమయం లేదు. 2023 మార్చిలోనే రాష్ట్రంలో ఎన్నికలు ఉండవచ్చు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి జనసైనికులు సిద్ధంగా ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని భరించేందుకు ప్రజలైతే సిద్ధంగా లేరు. గడప గడపలో వస్తున్న ఛీత్కారాలే దీనికి నిదర్శనం. పార్టీ కోసం పటిష్టంగా పని చేసేందుకు సన్నద్ధం అవండి. పార్టీ షణ్ముఖ వ్యూహాన్ని వివరించండి. యువత కోసం ప్రతి ఏటా లక్ష మందికి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి, పదిమందికి ఉపాధి కల్పించే అద్భుతమైన భవిష్యత్తు కార్యక్రమాలు ఉన్నాయి. వీటిపై జనసైనికులు ప్రతి గడపకు వెళ్లి వివరించండి. మార్పు కోసం వేచి చూస్తున్న ప్రజలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు వ్యూహాలను దగ్గర చేయండి.
* రైతులను నిలువునా మోసం చేశారు
వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించి, రైతులను నిలువునా మోసం చేస్తున్న ప్రభుత్వం ఇది. రైతు భరోసా కేంద్రాల పేరుతో దగా చేసిన సర్కారు ఇది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో తన సొంత డబ్బును వెచ్చిస్తున్నారు. ఈ ప్రభుత్వం మాత్రం మాయ మాటలు చెబుతూ కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కూడా సరైన సమయానికి ఇవ్వకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ విషయాన్నీ రైతులకు వివరించేలా జనసైనికులు పని చేయాలి. జనసైనికుల అభిప్రాయాలనూ వారి సూచనలు, సలహాలను నాయకులు తీసుకోవాలి. జనసైనికుల మనోగతాన్ని నాయకులు వినండి. వారికీ తగిన గౌరవం ఇస్తేనే, పార్టీకి గౌరవం ఉంటుంది.
* పాలకుల మాట వినేందుకు సిద్ధంగా లేరు
ప్రజల కష్టాలు తీరాలంటే, శ్రీ జగన్ రెడ్డి గద్దె దిగాలి అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా ఈ ప్రభుత్వం మాట వినేందుకు సిద్ధంగా లేదు. కొన్ని రోజుల్లో ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తుంది అని ప్రభుత్వ అధికారులకు అర్థమైంది. మరికొన్ని రోజుల్లోనే అధికార యంత్రాంగం తీరులోనూ మార్పు వస్తుంది. బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదిరించి పోరాడిన గడ్డ తెనాలి. మహాత్మాగాంధీ నాలుగుసార్లు పర్యటించినప్పుడు ఇక్కడి ప్రజలు ఉదారంగా తమ ఒంటిపై ఉన్న నగలను స్వచ్ఛందంగా స్వాతంత్ర సంగ్రామానికి విరాళంగా ఇచ్చిన త్యాగమూర్తుల గడ్డ. అదే చైతన్యాన్ని వచ్చే ఎన్నికల్లో చూపించండి. ఆరు నెలలు గట్టిగా కష్టపడితే కచ్చితంగా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గాదె వెంకటేశ్వర రావు, కళ్యాణం శివ శ్రీనివాస్, బండారు రవికాంత్, ఇస్మాయిల్ బేగ్, టి.వి. రమణరావు, శ్రీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.