పాలన చేతకాక ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు

* విజయదశమి నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర
* ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం
* వచ్చే ఏడాది మార్చి నాటికి ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది
* మంగళగిరి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

‘రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. సంక్షేమం పేరుతో దివాలా తీయించారు. కనీసం బయట అడుగు కూడా పెట్టని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి ఇక చేసేది ఏమి లేక వచ్చే ఏడాది మార్చి నాటికి ముందస్తు ఎన్నికలకు సిద్ధం అయ్యార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విలేకరులతో మాట్లాడుతూ “ఇప్పటికే సంక్షేమం పేరుతో పరిమితికి మించి అప్పులు చేశారు. ఇక ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. మరో పక్క ప్రజల్లో నానాటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువవుతోంది. ఇవన్నీ ఎదుర్కోలేని ఈ ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు ముహూర్తం పెట్టుకున్నారు.
* అసమర్థ ముఖ్యమంత్రి
అద్భుతంగా పాలించమని ప్రజలంతా ఏకపక్షంగా 151 ఎమ్మెల్యే సీట్లను కట్టబెడితే, కనీసం దానిని కూడా గౌరవప్రదంగా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం విచారకరం. ప్రజలకు ఉపయోగపడని అభివృద్ధి కార్యక్రమాల పేరు చెబుతూ కేవలం ప్రభుత్వం పత్రికా ప్రకటనలకు పరిమితమైంది. వాటిని చూసే అద్భుతమైన పాలన అని మురిసిపోతోంది. ఒక పక్క ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తుంటే బలమైన నిరసన సెగ తగులుతోంది. మరో పక్క తీసుకొచ్చిన అప్పులతో మరో ఏడాది రాష్ట్రాన్ని నడపలేం అని ఈ ముఖ్యమంత్రికి అర్ధం అయ్యింది. అందుకే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. కచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాడుతాం. కులాల మధ్య కుంపట్లు రాజేసి ఓట్ల రాజకీయం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నింది. పాలనా లోపాలను కప్పిపుచ్చుకునేందుకే రకరకాల వివాదాలు తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది.
* ఇక పోరాటమే శరణ్యం
ప్రజా కోర్టులోనే ప్రభుత్వ వ్యతిరేకతను ఎత్తి చూపుతాం. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయదశమి నుంచి చేపట్టబోయే యాత్ర నభూతో న భవిష్యత్ అన్న రీతిన సాగబోతుంది. ప్రజా క్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. విజయ దశమి నుంచి చేపట్టబోయే యాత్ర ద్వారా ప్రభుత్వ తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతాం.. పార్టీ శ్రేణులు సైతం యాత్రలో ఉత్సాహంగా పాల్గొనాల”ని స్పష్టం చేశారు.