జ్వరాల అదుపుకు గ్రామాల్లో, వార్డుల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి

  • గ్రామాల్లో, పీహెచ్సీలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
  • జిల్లా ఆస్పత్రిలో పడకలు పెంచి, వైద్య నిపుణులు నియమించాలి
  • మలేరియా, డెంగ్యూ జ్వరాలకు జిల్లా ఆస్పత్రిలో పూర్తిస్థాయి చికిత్స అందించాలి
  • ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులు నియంత్రణకు చర్యలు చేపట్టాలి
  • పల్లెల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలి
  • నీటి పరీక్షలు నిర్వహించాలి
  • జిల్లా ఆసుపత్రిలో ప్లేట్లెట్స్ ఎక్కించే ఏర్పాట్లు చేయాలని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో విజృంభిస్తున్న జ్వరాలను అదుపు చేసేందుకు గ్రామాల్లో, వార్డుల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. ఆదివారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, కర్రి మణి తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలకు గాను జిల్లాలో వైరల్, మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. వేలాదిమంది ప్రజలు జ్వరాల భారిన పడి జ్వర పీడితులు సంచి వైద్యులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులెడుతున్నారన్నారు. దీంతో ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటికీటలాడుతున్నాయన్నారు. జ్వరాలు భారిన పడి అక్కడక్కడ మృత్యువాత పడిన సందర్భాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కాబట్టి తక్షణమే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. అలాగే దోమలు పెరుగుదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పారిశుధ్య పనులు జిల్లా వ్యాప్తంగా చేపట్టి దోమల నివారణకు రసాయనాల పిచికారీ, ఫాగింగ్ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో, పీహెచ్బీల్లో, అర్బన్ హెల్త్ సెంటర్లలో, జిల్లా ఆస్పత్రిలో వైద్యులు వైద్య సిబ్బంది అన్నివేళల్లో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం జ్వరాల కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే వేల కొలది ఖర్చు అవుతుందన్నారు. అది పేదలకు భారంగా ఉందన్నారు. కాబట్టి ఆయా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులు నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. వీలైనంతవరకు ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ వైపు వెళ్లకుండా ప్రభుత్వ వైద్య సేవలు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో పడకలు పెంచి, వైద్యనిపుణులను, వైద్య సిబ్బందిని నియమించాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే జిల్లా ఆస్పత్రిలో మలేరియా, కు డెంగ్యూ జ్వరాలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్లేట్లెట్స్ ఎక్కించే యంత్రాలను సమకూర్చి జిల్లా ఆస్పత్రిలో సేవలు అందించాలన్నారు . ప్రస్తుతం జిల్లాలో ప్లేట్లెట్స్ ఎక్కించే సదుపాయం లేకపోవడంతో రోగులు ఇటు శ్రీకాకుళం అటు విజయనగరం, విశాఖపట్నం పరుగులు తీయాల్సి వస్తోంది అన్నారు. తక్షణమే దీనిపై ఉన్నతాధికారులు, పాలకులు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు. కలుషితమైన తాగునీటిని సరఫరా చేయకుండా పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని కోరారు. నీటి పరీక్షలు నిర్వహించాలని కోరారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలకు మృతి చెందే దౌర్భాగ్యం ప్రజలకు లేకుండా పాలకులు, అధికారులు చూడాలన్నారు.