7వ తేదీ నుంచి మెట్రో సేవలు.. దశల వారీగా జర్నీ

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మెట్రో సేవలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తూ .. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అధ్యక్షతన ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ 7వ తేదీ నుంచి మెట్రో సేవలను దశల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. బోర్డు సమావేశంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ను రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైళ్లల్లో సామాజిక దూరం పాటించేందుకు మెట్రో రైళ్లల్లోని సీట్ల మీద మార్కింగ్‌ను ఏర్పాటు చేస్తారని, ఆ సీట్లను మెట్రో రైళ్లల్లోని సీసీ టీవీల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మానిటరింగ్‌ చేస్తారు. స్టేషన్‌ కంట్రోలర్‌, ట్రైన్‌ ఆపరేటర్‌లు పర్యవేక్షిస్తారు. మెట్రో రైళ్లల్లో ప్రయాణించే వారితో పాటు ఉద్యోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మెట్రోస్టేషన్‌లలో మాస్కులను విక్రయానికి ఉంచుతారు. మాస్క్‌ లేకుండా ప్రయాణం చేస్తే నిబంధనలకు అనుగుణంగా జరిమానా విధిస్తారు. మెట్రో స్టేషన్‌లలోకి వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసిన తర్వాతే అనుమతిస్తారు. శానిటైజర్లను మెట్రో స్టేషన్‌లలో అందుబాటులో ఉంచుతారు. స్మార్ట్‌ కార్డ్‌, మొబైల్‌ క్యూఆర్‌ కోడ్‌ టికెట్లు, ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే టికెట్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇవే కాకుండా పలు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి మెట్రో సేవలను నగరంలో అందిస్తామన్నారు. ప్రయాణికులు ముందుగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందన్నారు. పార్కింగ్‌ స్థలాలలోనూ నిబంధనలు పాటించాలి.

మెట్రో రైలు అధికారులు పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ప్రయాణికులకు సేవలను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రోసేవల ప్రారంభానికి ముందు మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులకు సూచించామన్నారు.