ప్రజా సమస్యలపై సర్కారు నుంచి కనీస స్పందన కరవు

* సంక్షేమ పథకాలపై వైసీపీ వాళ్ళది గోబెల్స్ ప్రచారం
*ఆపద వచ్చినప్పుడు వారికి అండగా నిలిచే ఏకైక పార్టీ జనసేన
* కార్యకర్తల క్షేమాన్ని పవన్ కళ్యాణ్ కోరుకుంటారు
* నీలాద్రిరావుపేటలో క్రియాశీలక సభ్యుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల చెక్కు అందించిన నాదెండ్ల మనోహర్

అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిన వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గోబెల్స్ ప్రచారం చేసుకొంటోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవయ్యిందని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో కూడా కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ జనసేన అని తెలిపారు. కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా భావించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని అన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలలో భరోసా నింపేందుకు బాధ్యతగా పార్టీ నాయకులంతా కలసి వచ్చి వారికి పార్టీ తరఫున రూ. 5 లక్షల సాయం చేస్తున్నట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, నీలాద్రిరావుపేటకు చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు ఆచంటి సూరిబాబు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన నాదెండ్ల మనోహర్.. సూరిబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. భార్య శ్రీమతి సూర్యకుమారి, పిల్లలను ఓదార్చారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఇచ్చే రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు. కుటుంబ పరిస్థితులపై ఆరా తీసి ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ “ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యులు శ్రీ సూరిబాబు కుటుంబాన్ని ఆదుకోవడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఇక్కడికి పంపారు. సూరిబాబు చిన్న వయసులో మృతి చెందడం బాధాకరం. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలి. వారికి విద్యావకాశాలు కల్పించేందుకు కూడా మా స్థానిక నాయకులు సహకరిస్తారు” అన్నారు.
నీలాద్రిరావుపేట వచ్చిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి దారిపొడుగునా ఆ గ్రామ ప్రజలు సమస్యలు చెప్పుకున్నారు. ఇళ్లకు వెళ్లేందుకు కనీసం దారి లేని పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ.. “నీలాద్రిరావుపేటలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమయ్యింది. చిన్న వంతెన కావాలని ప్రజలు అడుగుతుంటే పట్టించుకునే వారు లేరు” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పార్టీ నాయకులు పాటంశెట్టి సూర్యచంద్ర, మేడా గురుదత్ ప్రసాద్, బండారు శ్రీనివాస్, తుమ్మల రామస్వామి, మర్రెడ్డి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్యబాబు, వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.