మంత్రి అమర్‌ నాథ్‌ని బర్త్‌రఫ్‌ చేయాలి: గురాన అయ్యలు

విజయనగరం, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఐ.టి.శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ని తక్షణం మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని జనసేన నాయకుడు గురాన అయ్యలు డిమాండ్‌ చేశారు. అమాయక విద్యార్ధుల మీద తన ప్రతాపాన్ని చూపేందుకు మంత్రి అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. తాను వెళ్తున్న సమయంలో పవన్‌ కల్యాణ్‌కి మద్దతుగా విద్యార్ధులు నినాదాలు చేస్తుంటే సహించలేక ఇటువంటి దాడులకి పాల్పడేటట్లు ప్రేరేపిస్తారా అని ప్రశ్నించారు. విజయనగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడి కోసం ఎవరూ మాట్లాడకూడదని కొత్త చట్టం ఏమైనా అమరనాథ్‌ చేశారా అని ప్రశ్నించారు. ఎస్‌ఐ దివాకర్‌ని పంపి కళాశాలలో ఉన్న విద్యార్ధులను బయటికి తీసుకుని వచ్చి, వారిని కొట్టిస్తారా అని నిలదీశారు. ఇది చట్టపరమైన చర్యేనా అని ప్రశ్నించారు. ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలకి పాల్పడడం వలన ప్రభుత్వానికే అప్రతిష్టని అన్నారు. ఐ.టి.శాఖామంత్రిగా ఆయన విధులు ఏమిటో తెలియని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పశ్చాత్తపపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సభ్యతా సంస్కారం లేకుండా అధికారాన్ని చేతులోకి తీసుకుని విద్యార్ధుల మీద ప్రతాపం చూపడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఇటువంటి పోకడలకు స్వస్తి చెప్పకపోతే ప్రజాఛీత్కారాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు.

మంత్రి ఆదిమూలపు సురేష్‌ నోరు అదుపులో పెట్టుకో :

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గురాన అయ్యలు అన్నారు. జగన్మోహన్‌రెడ్డి దగ్గర మెప్పుకోసం కొందరు మంత్రులు జనసేనానిపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు గురించి ప్రశ్నించకుండా, డిల్లీలో కేంద్ర పెద్దల కాళ్లు మొక్కుతూ, వ్యభిచార రాజకీయాలు చేస్తున్న వైకాపా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు జనసేనానిపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ సొంతంగా పార్టీ పెట్టుకున్నారని, ఆయన ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో తమ పార్టీ సొంత వ్యవహారమన్నారు. తమ పార్టీ పొత్తుల గురించి, పోటీ చేసే స్థానాలు గురించి వైకాపా నాయకులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డిలా ఎవరో పెట్టిన పార్టీని తాము లాక్కోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వైకాపా మంత్రులు, ప్రజాప్రతినిధులు చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవుపలికారు. జనసేనపై విమర్శలు కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.