డెల్టాకు దాళ్వా ఇవ్వలేకపోతే మంత్రి జోగి రాజీనామా చేయాలి

పెడన జనసేన పార్టీ నాయకులు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై, జగనన్న కాలనీలో మెరక పనుల అవకతవకలపై, గూడూరు జడ్పీ స్కూల్లో నాబార్డ్ నిధుల దుర్వినియోగం, నియోజకవర్గానికి దాళ్వా పంట ఇవ్వాలని డిమాండ్తో సోమవారం గూడూరు మండలం, శారద పేటలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరిరామ్ మాట్లాడుతూ గూడూరు జడ్పీ పాఠశాలలో 72.80 లక్షల రూపాయల నాబార్డ్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అన్నారు. కాంట్రాక్టర్, అధికారులు కుమ్మక్కై లక్షల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేశారని ధ్వజమెత్తారు. కట్టని తరగతులకు బిల్లులు పొందారన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు వైసిపి మండలాధ్యక్షులు, జడ్పిటిసి మెంబర్ పత్రికా ముఖంగా వెల్లడించారు. ఈ విషయంపై జోగి రమేష్ ఎందుకు స్పందించడం లేదు. ఈ అవినీతిలో మంత్రి వాట ఎంతో చెప్పాలని జోగి రమేష్ కి సవాలు విసిరారు. ఎస్ వి బాబు మాట్లాడుతూ… అవినీతి చక్రవర్తి, అబద్దాలకోరు మంత్రి జోగి రమేష్ సాగునీరు కొరత కారణంగా దాళ్వా ఇవ్వలేమని అబద్ధాలు వల్లిస్తూ నియోజకవర్గ ప్రజలను మోసగిస్తున్నారు అని అన్నారు. కృష్ణా డెల్టాకు ప్రధాన నీటి ప్రాజెక్టులు అన్ని నిండుకుండల్లా ఉన్నాయి. పెడన నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. గత దాళ్వా కి ఈసారి ఒక పంట త్యాగం చేయండి. పులిచింతల మరమ్మతు, పెడన నియోజకవర్గంలోని సాగునీరు కాలువలు, మురికి నీటి కాలువలను మరమ్మతులు చేస్తామని తరువాత ప్రతి సంవత్సరం మూడు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఇవ్వాలని జోగి మాయ మాటలు చెప్పారు. నియోజకవర్గ రైతుల ఆకాంక్షల మేరకు కచ్చితంగా దాళ్వా ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నియోజకవర్గంలో జగనన్న కాలనీలో జరుగుతున్న అవకతకులపై మంత్రి స్పందించాలి. పెడన పట్నంలోని జగనన్న మూడు కాలనీలో 6.30 కోట్ల రూపాయల మేరక పనుల్లో భారీ అవినీతి జరిగింది. అనేక కుటుంబాలను ఆర్థికంగా దిగజారుస్తూ, అప్పుల పాలు చేసే పేకాటను మంత్రి అనుచరులే నిర్వహించడం అత్యంత దారుణమైన విషయం. నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేసి, అభివృద్ధి అనే మాట ఎత్తని అవినీతిపరుడు జోగి రమేష్ కూడా పవన్ కళ్యాణ్ ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. పవన్ కళ్యాణ్ పై అకారణంగా ఆరోపణలు చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం అని ఎస్ వి బాబు హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బట్టు లీలా కనకదుర్గ, బత్తిన హరిరామ్, ఎస్ వి బాబు, పండమనేని శ్రీనివాస్, ఊస వెంకయ్య, చీర్ల నవీన్ కృష్ణ, కనపర్తి వెంకన్న, శీరం సంతోష్, గల్లా హరీష్, ముద్దినేని రామకృష్ణ, సమ్మెట గణపతి, సమ్మెట చిన్ని, సమ్మెట శివయ్య, పామర్తి వీర ప్రకాష్, దాసరి రవీంద్ర, మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.