రెండు చోట్ల ఓటు వేసిన ఎమ్మెల్సీ కవిత

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. పోతంగల్‌ ఓటర్​ లిస్ట్​లో పోలింగ్​బూత్​నెం.183, సీరియల్​ నెంబర్​361పై ఇప్పటికీ కవిత పేరుతో ఓటు ఉంది. 2014, 2019 జనరల్​ ఎలక్షన్స్​తో పాటు సర్పంచ్​, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన భర్త, అనిల్​ కుమార్​, అత్తామామలతో కలిసి ఆమె ఓటు వేశారు. ఎలక్షన్​ కమిషన్​ వెబ్​సైట్​ ప్రకారం బోధన్​ నియోజకవర్గంలోని పోతంగల్​ అప్పర్​ ప్రైమరీ స్కూల్​లో కవిత ఓటరుగా ఎన్​రోల్​ చేసుకున్నారని, ఇప్పటికీ అక్కడే ఆమెకు ఓటు హక్కు ఉందని, అయినా కూడా బంజారాహిల్స్​లో కవిత ఓటెలా వేశారని ఇందిరా శోభన్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఓటును దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఆధారాలతో సహా మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇందిరా  ఫిర్యాదు చేశారు.

కవితకు చిత్తశుద్ధి ఉంటే నిజామాబాద్ జిల్లాలోని ఓటును తొలగించిన తర్వాత.. ఇక్కడ ఓటు వేస్తే బాగుండేదన్నారు. సాక్షాత్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెన ఇలా రెండు చోట్ల ఓటు వేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగ పరుస్తూ.. దొంగ ఓటు వేసిన కవితకు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. కవిత తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్న ఇందిరాశోభన్‌.. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే కవిత ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు. కాగా మంత్రి కేటీఆర్ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో ఓటు వేసి.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఓటు ఎలా వేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయితే నిబంధనల ప్రకారమే ఓటు బదలాయింపు జరిగినది అని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం పొతంగల్‌ గ్రామ పరిధిలో తనకు, తన భర్తకు ఉన్న ఓటు హక్కును ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలోకి మార్చాలని ఎమ్మెల్సీ కవిత అక్కడి ఈఆర్‌వోకు దరఖాస్తు చేసుకున్నారని.. నవంబరు 28న ఓటు బదిలీ ప్రక్రియ పూర్తయిందని, దీంతో కవిత హైదరాబాద్‌లో ఓటు వేశారని పార్టీ నేతలు తెలిపారు. కాగా, తమకు ఖైరాతాబాద్‌ ఈఆర్‌వో నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పొతంగల్‌ ఉన్న కవిత ఓటును ఎన్నికల కమిషన్‌ జాబితా నుంచి తొలగించామని.. నేషనల్‌ సర్వీసు ఓటర్ల లిస్టులో వారం రోజుల తర్వాత తొలగిస్తారని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ వెల్లడించారు.