పోలీసుల తీరును ఖండించిన ముత్తా శశిధర్

కాకినాడ సిటి, జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ సిటి ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో పత్రికావిలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ బుధవారం రాత్రి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన మంగళగిరి ఆఫీసు మరియు స్టాఫ్ క్వార్టర్స్ కి రాష్ట్ర పోలీసులు వెళ్ళి హడావిడిని సృష్టించడం జరిగిందనీ అర్ధరాత్రి 12 గం.కు నిద్రిస్తున్న స్టాఫ్ ని లేపి ఇంటరాగేషన్ పేరుతో వేధించడాన్ని జనసేనపార్టీ తరుపున తీవ్రంగా తాము ఖండిస్తున్నామన్నారు. అసలు అదేమైనా అసాంఘికశక్తులు ఉండే ప్రదేశమా కేవలం మా పార్టీ అధ్యక్ష్యులకి అందుబాటులో ఉండి తమసేవలు నిరంతరం అందచేయడానికి కేటాయించిన వసతి సముదాయమని తెలిసికూడా ఇలా దాడిచేయడం చూస్తుంటే జనసేనపార్టీ పట్ల వాళ్ళు భయంతో ఇలా చేస్తున్నారని ప్రజలకు అర్ధమవుతోందన్నారు. ఆనాడు అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ ని రాష్ట్రంలోకి రానివ్వకూడదన్న ఉద్దేశంతో ఆపితే ఆప్రదేశానికి ఎన్ని నిమిషాల్లో జనసైనికులు చేరుకున్నారో ఒక్కసారి గుర్తుచేసుకోమన్నారు. జనసేన శ్రేణులని భయబ్రాంతులకి గురిచేస్తే పార్టీ నిర్వీర్యం అవుతుందన్న భ్రమలో ఉన్నారని కానీ ఇలాంటి చర్యలవల్ల ప్రజలలో వీళ్ళు అభాసుపాలవ్వడం తప్ప జనసైనికులు ఆగేదేలేదని నొక్కివక్కాణించారు. అలాగే జనసేనని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమీషంతో సంబంధం లేకుండా ఎలక్షన్ ఆఫీసర్లని వీళ్ళే వేసేసుకుంటున్నారని, ఇదే విషయంపై పిఠాపురంలో చేసినదానిపై తమ పార్టీ ఎలక్షన్ కమీషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం ఏర్పరిచి మళ్ళీ ఎన్నికలలో నెగ్గి వాళ్ళ పాలన తెచ్చుకోవాలన్నది వీళ్ళ ఆలోచన అనీ ఇది వీళ్ళకి అలవాటే అని, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాడులో ఓల్డ్ సిటీలో ఘర్షణల సాకుగా చూపెట్టి ముఖ్యమంత్రి అవ్వాలన్న ప్రయత్నాలు అవి ఎవరుచేసారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడు అదే రీతిలో ఇక్కడ అమలుచేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. ఈ అయిదేళ్ళుగా పోలీసులు ఆప్రాంతంలో రైడ్ చేసారని ప్రశ్నించారు. ఏదైనా అంటే కాకినాడలో డ్రగ్స్ విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతుంటే పోలీసులు రైడ్ చేసారా అని అడిగారు. డ్రగ్స్ రాజధానిగా కాకినాడని చేసారు, కాకినాడలో యువతని నిర్వీర్యం చేసారు, మరి ఇక్కడ ఎక్కడా చేయని చర్యలు అక్కడెక్కడో చేయడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వచ్చే కొద్ది రోజుల తరువాత జనసేనపార్టీ తెలుగుదేశంల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని, అధికారులు కూడా ఒకటి గుర్తించుకోవాలని కుర్చీ అన్నది శాశ్వతం కాదనీ మీరు కూడా పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై ఈ ఉద్యోగాలు చేపట్టారనీ, మీరు ప్రజలకి సేవ చేయాలనీ ప్రభుత్వానికి కాదని హితవుపలికారు. కాకినాడలో కూడా గత కొంత కాలంగా తాము ప్రజలను చైతన్యపరుస్తూ మేము సిద్ధం అనే కార్యక్రమం, జగనన్న పాపాలు అనే కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు ఆదరిస్తూ తమ మద్దతుని తెలియచేస్తున్నారన్నారు. మొన్న మంగళగిరిలో మా జనసైనికులందరికీ బూత్ స్థాయి శిక్షణా కార్యక్రమం జరిగిందనీ, తాడేపల్లిగూడెం సభకి ఉరికే ఉత్సాహంతో తమ జనసైనికులు పాల్గొన్నారనీ, కాకినాడలో జనసేనపార్టీ బలంగా ఉందనీ, ఇక్కడే కాదు గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్రంలో కూడా చాలా బలంగా ఉందనీ అతికొద్దిరోజులలో పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవడమే కాదు ఆయన నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటామని తెలియచేసారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా శెక్రటరీ అట్ల సత్యన్నారాయణ, సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, నాయకులు శ్రీమన్నారాయణ, మనోహర్ లాల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.