మీరు పోలీసులా వైసీపీ కార్యకర్తలా?: ఆళ్ళ హరి

గుంటూరు, ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సమాజంలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు వైసీపీ నేతల చేతిలో కీలుబొమ్మలా మారిపోవడం సిగ్గుచేటని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తాము పోలీసులమన్న గురుతర బాధ్యతలను మరచి పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరిలో ఉంటున్న జనసేన సిబ్బందిపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సోదాలు నిర్వహించడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసులు ప్రజలు కట్టే పన్నుల్లోంచి జీతాలు తీసుకుంటున్నారని, వైసీపీ నేతల అవినీతి సంపాదనలో కాదన్న విషయాన్ని పోలీసులు మరచిపోతున్నారని విమర్శించారు. ఒకవైపు తాడేపల్లిగూడెం సభ విజయవంతం అవ్వటం, జయహో బీసీ బహిరంగ సభకు ఊహించని మద్దతు లభించటంతో ఒక్కసారిగా తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలాయన్నారు. ఓటమి కళ్ళ ముందు కదలాడుతుండటంతో వైసీపీ నేతలు మతిభ్రమించి వికృతంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేన పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలనుకోవటం పిచ్చి భ్రమ అని అన్నారు. వైసీపీ దురాగతాలపై గత ఐదేళ్లుగా జనసేన అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. ఇన్నేళ్ల తమ పోరాటంలో ఒక్క జనసైనికుడి కంట్లో కానీ ఒక్క వీర మహిళ కంట్లో కానీ భయం ఛాయ కనపడిందా అని వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. సిద్ధం సిద్ధం అంటూ చొక్కా మడతాబెట్టింది ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడటానికా అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ఎలాంటి యుద్ధం కావాలని కోరుకుంటే అలాంటి యుద్ధం ఇవ్వటానికి జనసేన సదా సిద్ధంగా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. జనసేన సిబ్బందిపై సోదాలు నిర్వహించిన పోలీసులపై వెంటనే జిల్లా ఎస్పీ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆళ్ళ హరి కోరారు. విలేకరుల సమావేశంలో గడ్డం రోశయ్య, సయ్యద్ షర్ఫుద్దీన్, పులిగడ్డ గోపి, ఆకుల మల్లి తదితరులు పాల్గొన్నారు.