రజకుల కుటుంబాలను కలిసిన ముత్తా శశిధర్

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ గారు 43వ డివిజన్ అధ్యక్షులు శ్రీమన్నారాయణ వార్డు నాయకులు నరం మణికంఠ ఆధ్వర్యంలో ట్రెజరీకోలనీలోని రజకుల కుటుంబాలను కలిసి మాటామంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంలో ముత్తా శశిధర్ రజక కులస్తులతో వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలని అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కులవృత్తిని నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులని ఎదుర్కొంటున్నామనీ, దోభీకానా ఏర్పాటు చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదని, దీనితో నీటిని దూరం నుండీ తోడుకుని తెచ్చుకోవాలిసి వస్తోందనీ వృద్ధులకు ఇది అశనిపాతంలా ఉందనీ, సొంత ఇళ్ళు లేక బట్టలు ఉతకడానికి స్థల లభ్యత ఇబ్బందితో వాయిదాల పద్దతిలో రాళ్ళ మీద ఉతకడం చేస్తునామని గగ్గోలు పెట్టారు. ఇవే కాక కుటుంబ పోషణ, పిల్లల చదువులు వంటి అనేక అంశాలలో ఆర్ధిక స్తోమతలేక సతమతమవుతున్నామని ఆక్రోశించారు. ముత్తా శశిధర్ మాట్లాడుతూ సమాజం అంటే విభిన్న కులాల కలయిక అనీ, దేని ప్రాముఖ్యత దానిదే అనీ, అన్నింటినీ సమన్వయంతో వృద్ధి చేసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదనీ, కానీ మన దురద్రుష్టం ఏమిటంటే ఈ ప్రభుత్వానికి పాలన తెలియదని విమర్శించారు. నాటి ప్రభుత్వాలు చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ వారికి కావలిసిన ఉపకరణాలను, ఋణసదుపాయలను కలగచేస్తూ ఉండేవనీ, నేడు అవన్నీ మాయం అయ్యాయనీ, అసలు బలహీన వర్గాల సంక్ష్యేమం చూసే బి.సి కార్పోరేషన్ ఎక్కడ ఉందో తెలియని దుస్థితి కారణం ఈ వై.సి.పి ప్రభుత్వమే అన్నారు. ఒక్క మూడు నెలలు ఓపిక పట్టమని కోరుతూ, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కూటమికి మద్దతు ఇచ్చి సుపరిపాలనను అందించే ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతు ఇవ్వమని కోరారు.